Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ : తుది అంకానికి చేరిన టోర్నీ.. నేడు తొలి సెమీ ఫైనల్

Advertiesment
icc t20 world cup

వరుణ్

, గురువారం, 27 జూన్ 2024 (08:23 IST)
అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఈవెంట్ తుది అంకానికి చేరుకుంది. ఇందులోభాగంగా, గురువారం తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం జరిగే తొలి సెమీఫైనల్లో సంచలన అఫ్ఘానిస్థాన్‌ తొలిసారి ఐసీసీ టోర్నీ టైటిల్‌ గెలవాలని పట్టుదలగా ఉన్న సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. 
 
వర్ణ వివక్ష నిషేధం నుంచి బయటపడి 1991లో తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సఫారీలు.. నాటి నుంచి ఇప్పటివరకు టీ20, వన్డే వరల్డ్‌ కప్‌లలో టైటిల్‌ ఫైట్‌కు చేరలేదు. పైగా.. ప్రతి మేజర్‌ టోర్నీలలో కీలక మ్యాచ్‌ల్లో తడబాటుకు లోనవుతూ చోకర్లుగా సఫారీలు పేరు పొందారు. ఈసారి అందుకు భిన్నంగా ఉత్కంఠ భరిత మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి సెమీస్‌ వరకు వచ్చింది. నేపాల్‌పై ఒక్క పరుగుతో, బంగ్లాదేశ్‌పై నాలుగు రన్స్‌తో, వెస్టిండీస్‌పై మూడు వికెట్లతో నెగ్గడం విశేషం. 
 
ఈ టోర్నీలో అపజయమే లేకుండా సెమీస్‌ వరకూ దూసుకొచ్చిన సౌతాఫ్రికా ఆ జోరు కొనసాగిస్తుందా అనేది చూడాలి. ఓపెనర్‌ డికాక్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. మార్‌క్రమ్‌, స్టబ్స్‌, క్లాసెన్‌తో మిడిలార్డర్‌ డైనమిక్‌గా ఉంది. ఇక హార్డ్‌హిట్టర్‌ మిల్లర్‌ సంగతి చెప్పాల్సిన పనిలేదు. స్పిన్నర్లు కేశవ్‌, షంసీ ప్రత్యర్థి బ్యాటర్ల పనిపట్టగలరు. 
 
మరోవైపు.. 20 ఏళ్ల కిందట.. 2004లో ఏషియన్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ ట్రోఫీలో అఫ్ఘానిస్థాన్‌ తమ మొదటి అంతర్జాతీయ పోటీ ఆడింది. ఆపై రెండు దశాబ్దాల్లోనే ఏకంగా టీ20 వరల్డ్‌ కప్‌ సెమీస్‌కు చేరడం ఆ జట్టు అనూహ్య పురోగతికి అద్దం పడుతుంది. కెప్టెన్‌ రషీద్‌ అటు బౌలింగ్‌.. ఇటు బ్యాటింగ్‌లో ముందుండి జట్టును అమోఘంగా నడిపిస్తున్నాడు. ఓపెనర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ పవర్‌ ప్లేలో ప్రత్యర్థులకు గుబులు పుట్టిస్తున్నాడు. పేసర్లు ఫరూఖి, నవీనుల్‌ ప్రత్యర్థి బ్యాటర్లను గడగడలాడిస్తున్నారు. మరి మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌-ఇంగ్లాండ్‌ మ్యాచ్‌కు నిబంధనలు ఎందుకు మారాయి..?