Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధోనీ చూపుల కోసం ఎదురుచూసే ఆటగాళ్లు... ఆ కెప్టెన్సీని అభినందిద్దాం.. సచిన్

"టీ 20, వన్డే వరల్డ్ కప్ రెండింటిలో విజయం సాధించిన ఘటనల్లో భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించిన ఎంఎస్ ధోనీ అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు తెలుపుతున్నాను. దూకుడుతనం కలిగిన ఆటగాడి నుంచి నిలకడ కలిగిన, నిర్ణయాత్మకమైన కెప్టెన్‌గా ధోనీ ఆవిర్భావాన్ని నేను

ధోనీ చూపుల కోసం ఎదురుచూసే ఆటగాళ్లు... ఆ కెప్టెన్సీని అభినందిద్దాం.. సచిన్
, గురువారం, 5 జనవరి 2017 (11:05 IST)
"టీ 20, వన్డే వరల్డ్ కప్ రెండింటిలో విజయం సాధించిన ఘటనల్లో భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించిన ఎంఎస్ ధోనీ అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు తెలుపుతున్నాను. దూకుడుతనం కలిగిన ఆటగాడి నుంచి నిలకడ కలిగిన, నిర్ణయాత్మకమైన కెప్టెన్‌గా ధోనీ ఆవిర్భావాన్ని నేను చూస్తూ వచ్చాను. విజయవంతమైన అతడి కెప్టెన్సీని అభినందించాల్సిన రోజిది. అలాగే  కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలన్న అతడి నిర్ణయాన్ని గౌరవించాల్సిన రోజిది. ఇంకా ఫీల్డ్‌లో తన ఆటతీరుతో మనల్ని ఆనందపర్చడానికి భవిష్యత్తులోనూ జట్టులో కొనసాగనున్న ధోనీకి శుభాకాంక్షలు."
 
ఒక ప్రపంచ స్థాయి దిగ్గజ బ్యాట్స్‌మన్ ఒక ప్రపంచ స్థాయి కెప్టెన్ గురించి హృదయపు లోతుల్లోంచి చెప్పిన మాటలివి. భారత క్రికెట్ జట్టులో భాగంగా తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్లో సచిన్ టెండూల్కర్ అత్యుత్తమ క్షణాల్లో కొన్నింటిని ధోనీ కెప్టెన్సీలోనే ఆస్వాదించాడు. ధోనీ నాయకత్వంలో ప్రపంచ కప్‌ను గెలవడం తన కెరీర్లో అత్యుత్తమ క్షణంగా వర్ణించాడు సచిన్. వన్డే క్రికెట్ చరిత్రలో తొలి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా సచిన్ 200వ పరుగును సాధిస్తున్నప్పుడు ధోనీ నాన్ స్ట్రయికర్‌గా ఉండి చూస్తుండటం క్రికెట్ చరిత్రలో అద్వితీయ క్షణాల్లో ఒకటిగా చెప్పవచ్చు.
 
మరి కొద్ది రోజుల్లో ఇంగ్లండ్‌తో వన్డే సీరీస్‌ జరగడానికి ముందు,  పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీకి ధోనీ రాజీనామా చేసినట్లు బీసీసీఐ ప్రకటించడం షాకింగ్‌గా ఉండవచ్చు కానీ ఇటీవలే భారత టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అసాధారణ విజయాలు సాధించిన క్షణంలోనే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కూడా నాయకత్వ మార్పిడీకీ ఇక ఎంతో కాలం పట్టదని అందరూ ఊహించారు. బీసీసీఐ యాజమాన్యం భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ కీలక నిర్ణయంపై ధోనీని సంప్రదించగానే మూడు ముక్కల్లో ఒకే అలాగే కానివ్వండి అని ప్రకటించిన ధీరోధాత్తుడు ధోనీ. 
 
ఆగ్రహాలు, ఆవేశకావేషాలు కెప్టెన్ల సహజ లక్షణాలుగా భావిస్తున్న తరంలో.. తన కంటి చూపుల కదలికల ద్వారా ముఖ కవళికల ద్వారా , చేయి ఊపటం ద్వారా జట్టు ఆటతీరును నిర్దేశించిన, మార్గదర్శకత్వం వహించిన ధోనీ అసాధారణ కెప్టెన్సీ మేనరిజాలను మనం ఇక చూడలేకపోవచ్చు. కానీ 2019లో జరుగనున్న వన్డే వరల్డ్ కప్‌కోసం భవిష్య కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రతి దశలోనూ మార్గనిర్దేశం చేసే ఆటగాడిగా ధోనీ ఉనికిని ప్రపంచ క్రీడా ప్రపంచం ఇంకా తిలకించనుంది. కాబట్టి మనం కూడా ఆ కెప్టెన్సీని అభినందిద్దాం.. ఆ నిర్ణయాన్నీ గౌరవిద్దాం..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతడి హితం కోసం ధోనీ కెప్టెన్సీకి వీడ్కోలు... తెర వెనుక ఏం జరిగిందో...?