Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అతడి హితం కోసం ధోనీ కెప్టెన్సీకి వీడ్కోలు... తెర వెనుక ఏం జరిగిందో...?

గత 12 సంవత్సరాలుగా భారత క్రికెట్ చరిత్రకు నూతన జవసత్వాలను అందించిన ఒక అద్వితీయ క్రీడాకారుడి నాయకత్వ చరిత్ర మూడంటే మూడు ముక్కల నిర్ణయంతో ముగిసింది. ఓకే దట్స్ ఇట్. బుధవారం రాత్రి జగమెరిగిన క్రికెట్ కెప్టెన్ ధోనీ శకం కెప్టెన్‌గా ముగిసిందని ప్రపంచానికి త

Advertiesment
Dhoni steps down as India's limited overs captain
, గురువారం, 5 జనవరి 2017 (10:53 IST)
గత 12 సంవత్సరాలుగా భారత క్రికెట్ చరిత్రకు నూతన జవసత్వాలను అందించిన ఒక అద్వితీయ క్రీడాకారుడి నాయకత్వ చరిత్ర మూడంటే మూడు ముక్కల నిర్ణయంతో ముగిసింది. ఓకే దట్స్ ఇట్. బుధవారం రాత్రి జగమెరిగిన క్రికెట్ కెప్టెన్ ధోనీ శకం కెప్టెన్‌గా ముగిసిందని ప్రపంచానికి తెలియడానికి ఆ మూడుపదాలే సరిపోయాయి. నాగ‌పూర్‌లో జరుగుతున్న రంజీ ట్రోపీ సెమిఫైనల్‌లో జార్ఖండ్ టీమ్ మెంటర్‌గా ఉంటున్న ఎంఎస్ ధోనీ బుధవారం ఉదయం బీసీసీఐ సెలెక్టింగ్ కమిటీ చైర్మన్ ఎంఎస్‌కే ప్రసాద్‌తో చేసిన చిట్ చాట్ ధోనీ కెప్టెన్సీకి ముగింపు వాక్యం పలికింది. కానీ ధోనీ తీసుకున్న ఆకస్మిక నిర్ణయంపై ఆ ఇద్దరూ ఎంత వృత్తిగత గోప్యతను కొనసాగించారంటే దాదాపు 12 గంటలపాటు బయటి ప్రపంచానికి ఆ విషయం తెలీకుండా పోయింది. ధోనీ ప్రదర్శించిన అద్భుతమైన ఆలోచనా స్పష్టతను ఎంఎస్‌కే ప్రసాద్ ప్రశంసించడం తప్పితే తెరవెనుక ఏం జరిగిందో ఒక్క మాట కూడా ఆ ఇద్దరిలో ఏ ఒక్కరూ ప్రస్తావించకపోవడం గొప్ప విశేషం అనే చెప్పాలి. 
 
అవును. ఇప్పుడు ఎంఎస్ ధోనీ అక్షరాలా పరిపూర్ణంగా మాజీ కెప్టెన్ అని చెప్పవచ్చు. 283 వన్డే మ్యాచ్‌ల్లో 9110 పరుగులు, 50.89 సగటుతో, 88 పైగా స్ట్రయిక్ రేటుతో సమకాలీన క్రికెట్‌ని, భారత జట్టును వెలిగించిన అద్వితీయ లీడర్ శకం అలా ముగిసింది. ఇప్పటికే టెస్ట్ కెప్టన్‌గా స్థిరపడిన విరాట్ కోహ్లీ నేతృత్వంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత భవిష్యత్తు గురించిన తమ ఆలోచనలను సెలెక్షన్ కమిటీ ధోనీతో పంచుకున్న మరుక్షణం ధోనీ ఒకే ఆలాగే కానివ్వండి అంటూ హుందా ప్రదర్శించాడు. అత్యున్నత కమిటీ చెప్పాక ధిక్కరించడం, అభ్యంతరం చెప్పడం ఎవరికైనా సాధ్యం కాకపోవచ్చన్నది నిజమే. కానీ జట్టులో స్థానం కోల్పోతున్నట్లు, కెప్టెన్సీ దూరమవుతున్నట్లు సంకేతాలు రాగానే ఇటీవలి చరిత్రలోనే భారత క్రికెట్ లోని ఉద్దండులు ఎన్నెన్ని ధిక్కార ప్రకటనలకు దిగారో, శోకన్నాలు పెట్టారో అందరికీ తెలిసిన విషయమే. 
 
తానింకా కొన్నాళ్లు పరిమిత ఓవర్ల క్రికెట్లో కెప్టెన్సీని నిర్వహించగలనని ధోనీ స్పష్టం చేసి ఉంటే బీసీసీఐ మొండికేసి ఉండేది కాదన్నదీ నిజమే. కానీ కేవలం ఐదు నెలల్లోపే చాంపియన్స్ ట్రోపీ జరగనుండటం, 2019లో ప్రపంచ కప్‌కి ముందు భారత జట్టు కేవలం 55 వన్డేలను మాత్రమే ఆడవలసి రావటం వంటి నేపథ్యంలో ధోనీ స్థానంలో కోహ్లీకి నాయకత్వాన్ని అప్పగించటానికి ఇదే సరైన సమయం అని సెలెక్టర్లు ఏకాభిప్రాయానికి వచ్చేశారని తెలుస్తోంది. అయినప్పటికీ ధోనీపై సెలెక్టర్లు ఒత్తిడి చేయలేదని, తుది నిర్ణయాన్ని ధోనీకే వదిలేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్ తన వారసుడిని మైదానంలో గైడ్ చేయడం అత్యంత కీలకమైన విషయమని, తీవ్ర ఒత్తిడితోకూడిన వన్డే ఫార్మాట్‌లో కెప్టెన్‌గా జట్టును నడపాల్సిన తొలి రోజుల్లో ఇప్పటికే కప్‌ను గెలిపించిన అనుభవజ్ఞుడి సహాయ సహకారాలు చాలా అవసరమని సెలెక్టర్ల కమటీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. 
 
విరాట్ ఇప్పటికే టెస్టు జట్టులో అద్భుత పాత్ర పోషిస్తున్నాడు. కానీ వన్డే టీమ్ కెప్టెన్సీలో ఒత్తిడి పూర్తిగా బిన్నంగా ఉంటుంది. అందుకే లిమిటెడ్ ఓవర్ల కెప్టెన్‌గా విరాట్ తన తొలి బాధ్యతలు తీసుకున్నప్పుడు ఫీల్డులో ఉండి పరిస్థితులను గమనిస్తూ విరాట్ కోహ్లీని గైడ్ చేసే పాత్రను ధోనీ పోషించాలని సెలెక్టర్ల కమిటీ భావించిందని, ధోనీ పూర్తిగా ఆటకు ప్యాకప్ చెప్పేసి, విరాట్ తనకు తానుగా జట్టును నడిపించాల్సిన సందర్భాన్ని, సన్నివేశాన్ని కమిటీ కోరుకోవడం లేదని క్రికెట్ వర్గాల సమాచారం. 
 
2014 డిసెంబర్ 30న మెల్‌బోర్న్‌లో బాక్సింగ్ డే టెస్టు సందర్భంగా ధోనీ టెస్ట్ క్రికెట్‌నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ధోనీ ఉన్నట్లుండి అలా ప్రకటించగానే, ఆ సీరీస్‌లో సిడ్నీలో జరగాల్సిన చివరి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలను విరాట్ స్వీకరించాల్సి వచ్చింది. కానీ వన్డే ప్రపంచ కప్ ఒత్తిళ్ల దృష్ట్యా సీనియర్ ధోనీ సహాయం కొత్త కెప్టెన్‌కు చాలా అవసరం అనే ఆలోచనే ధోనీ కెరీర్‌ను 2019 వరకు పొడిగించనుంది. 
 
తామెప్పుడు రంగంలోంచి తప్పుకోవాలనే విషయం గొప్ప నేతలకు తెలుసు. టీమ్ రెడీగా ఉందన్న విషయం ధోనీకి తెలుసు. మరో మూడు నాలుగేళ్ల వరకు అతర్జాతీయ క్రికెట్‌ను ఆడగలననీ తెలుసు. పైగా దేశంలోనే అత్యంత గరిష్టంగా ఫిట్‌నెస్ కలిగి ఉన్న కొద్ది మంది క్రికెటర్లలో ధోనీ ముందువరుసలోనే ఉన్నాడు. భారత క్రికెట్ చరిత్రను ఉద్దీపింపజేసిన ఒక గొప్ప కెప్టెన్ కథ అలా ముగిసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీ షాకింగ్ నిర్ణయం... 200వ వన్డేకు మిస్, కెప్టెన్సీకి గుడ్ బై, కోహ్లికి పగ్గాలు...