Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సఫారీలను చితక్కొట్టిన కుర్రోళ్లు.. వన్డే సిరీస్ భారత్ సొంతం

team india
, శుక్రవారం, 22 డిశెంబరు 2023 (07:15 IST)
సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత యంగ్ క్రికెటర్లు సఫారీలను చితక్కొట్టారు. ఫలితంగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్నారు. గురువారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 296 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని నిర్ధేశించగా, ఈ లక్ష్యం ఛేదన కోసం బరిలోకి దిగిన ఆతిథ్య సౌతాఫ్రికా జట్టు 45.5 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌట్ అయ్యారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ నాలుగు ప్రధానమైన వికెట్లు కూల్చి సఫారీల బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశాడు. దీంతో 78 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్ వన్డే సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది.
 
సౌతాఫ్రికా ఆటగాళ్లలో టోనీ డీ జోర్జి మాత్రమే 81 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. హెండ్రిక్స్ (19), టోనీ డీ జోర్జి (81), డస్సెన్ (2), మార్క్రమ్ (36), క్లాసెన్ (21), డేవిడ్ మిల్లర్ (10), ముల్డర్ (1), కేశవ్ మహారాజ్ (14), హెండ్రిక్స్ (18), విలియమ్స్ (2), బర్గర్ (1 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. కాగా 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా సంజూ శాంసన్, 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా అర్షదీప్ సింగ్ అవార్డులను అందుకున్నారు. 
 
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్ చేపట్టి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లలో సంజూ శాంసన్, యువ బ్యాటర్లు తిలక్ వర్మ, రింకూ సింగ్‌లు రాణించారు. నిజానికి ఒక దశలో 103 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత ఇన్నింగ్స్‌ను సంజూ శాంసన్ చక్కదిద్దాడు. తిలక్ వర్మతో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
 
భారత ఆటగాళ్ళలో రజత్ పటీదార్ (22), సాయి సుదర్శన్ (10), సంజూ శాంసన్ (108), కేఎల్ రాహుల్ (21), తిలక్ వర్మ (52), రింకూ సింగ్ (38), అక్షర్ పటేల్ (1), వాషింగ్టన్ సుందర్ (14), అర్షదీప్ సింగ్ (7 నాటౌట్), అవేశ్ ఖాన్ (1 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లు భారత బ్యాటర్లను ఆరంభంలో బాగానే కట్టడి చేశారు. వరుసగా విరామాల్లో కీలకమైన వికెట్లు తీశారు. అయితే సంజూ శాంసన్, తిలక్ వర్మ జాగ్రత్తగా ఆడడంతో టీమిండియా భారీ స్కోరు చేయగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో హెండ్రిక్స్ 3 వికెట్లు, నండ్రె బర్గర్ 2, విలియమ్స్, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్ ఒక్కోటి చొప్పున వికెట్లు తీశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దక్షిణాఫ్రికాతో వన్డే.. వెలిగిపోయిన సంజూ శాంసన్.. తిలక్ వర్మ అదుర్స్