బంగ్లాకు చెంపపెట్టు.. శ్రీలంక జెండాతో రోహిత్ సందడి.. లంక ఫ్యాన్స్ ఫిదా
శ్రీలంక స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని కొలంబో వేదికగా నిదహాస్ ముక్కోణపు ట్వంటీ20 టోర్నీకి శ్రీలంక జట్టు ఆతిథ్యమిచ్చింది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు విజ
శ్రీలంక స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని కొలంబో వేదికగా నిదహాస్ ముక్కోణపు ట్వంటీ20 టోర్నీకి శ్రీలంక జట్టు ఆతిథ్యమిచ్చింది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు విజేతగా నిలిచింది. నరాలు తెగే ఉత్కంఠత మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ చివరి బంతికి 5 పరుగులు చేయాల్సిన తరుణంలో బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ ఓ సిక్స్ కొట్టి.. భారత్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు.
ఈ విజయం తర్వాత భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ శ్రీలంక జాతీయ పతాకంతో మైదానంలో సందడి చేశారు. దీనికి శ్రీలంక ఫ్యాన్స్ ఫిదా అయిపోయి.. అతనిపై ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. ఒక దేశ క్రికెట్ జట్టు కెప్టెన్ ఇతర దేశ జాతీయ జెండాతో మైదానంలో సందడి చేయడం క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదు. పైగా, ఇదే తొలిసారి కూడా.
నిజానికి రోహిత్ శర్మ ఇలా చేయడానికి బలమైన కారణం లేకపోలేదు. ఈ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకపై అనూహ్య విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఈ గెలుపు అనంతరం బంగ్లా కుర్రోళ్లు మైదానంలో అతిగా ప్రవర్తించారు. నాగిని డ్యాన్స్ చేస్తూ లంక క్రికెటర్లతో పాటు ఆ దేశ ఆటగాళ్లను కించపరిచేలా ప్రవర్తించారు. ఈ చర్యలకు కౌంటర్ ఇచ్చేలా రోహిత్ శర్మ లంక జాతీయ జెండాతో మైదానంలో సందడి చేశారు.
బంగ్లాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో లంక ఫ్యాన్స్ టీమిండియాకు జైకొట్టారు. దీంతో రోహిత్ శర్మ విజయానంతరం లంక ఫ్యాన్స్‌కు మద్దతుకు ప్రతీకగా ఆ దేశ జెండాను ఊపుతూ వారిలో ఉత్సహాన్ని నింపారు. దీంతో రోహిత్‌పై లంక అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. క్రికెట్‌కే ఇదొక అందమని, రోహిత్ శర్మ శ్రీలంక జెండా పట్టుకోవడం సంతోషంగా ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది బంగ్లాదేశ్ పొగరుకు రోహిత్ చేసిన ఈ పని చెంపపెట్టులా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.