నిర్భయ కేసులోని నలుగురు దోషులకు ఈనెల 22వ తేదీన ఉరిశిక్షలను అమలు చేయనున్నారు. ఇందుకోసం తీహార్ జైలులో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఢిల్లీ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ల సమాచారాన్ని కూడా దోషులకు జైలు అధికారులు తెలిపారు. దీంతోవారి వెన్నులో వణుకు మొదలైంది.
ఢిల్లీ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్లపై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించారు. నిర్భయ ఘటన జరిగిన ఏడేళ్ల తర్వాత ఈ తీర్పు వెలువడటం చాలా శుభపరిణామన్నారు. ఈ తీర్పును దేశంలోని ప్రతి వ్యక్తి స్వాగతిస్తున్నాడని తెలిపారు. అందుకే ఈ తీర్పు చెప్పిన కోర్టుకు వందనాలు తెలుపుతున్నట్టు యూవీ చెప్పుకొచ్చాడు.
ఉరిశిక్షల అమలు తర్వాత అయినా నిర్భయ ఆత్మకు శాంతి చేకూరుతుందని యువరాజ్ పేర్కొన్నాడు. కాగా, పాటియాలా కోర్టు తీర్పు ప్రకారం ఈనెల 22న ఉదయం ఏడు గంటలకు నిర్భయ దోషులు పవన్ గుప్తా, ముకేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలను ఉరి తీయనున్నారు. ఈ నలుగురు ముద్దాయిలను మీరట్ జైలు తలారి పవన్ జలాద్ ఉరితీయనున్నాడు.
ఉరితీస్తే వచ్చే డబ్బుతో కుమార్తె పెళ్లి చేస్తా : పవన్
నిర్భయ కేసులోని నలుగురు ముద్దాయిలకు ఈనెల 22వ తేదీ ఉదయం 7 గంటలకు ఉరిశిక్షలను అమలు చేయనున్నారు. ఈ నలుగురిని మీరట్ జైలు తలారి పవన్ జలాద్ ఉరి తీయనున్నారు. ఇందుకోసం మీరట్ నుంచి ఢిల్లీకి తరలి రావాలని ఇప్పటికే ఆయనకు సమాచారం కూడా అందింది.
ఇదే విషయంపై తలారి పవన్ జలాద్ స్పందిస్తూ, నిర్భయ కేసులోని దోషులను ఎపుడెపుడు ఉరితీస్తానా? అంటూ ఎదురుచూస్తున్నాను. ఇందుకోసం తనను మీరట్ నుంచి తీహార్ జైలుకు తీసుకెళతారు. అందుకే 22వ తేదీ కోసం ఎదురు చూస్తున్నాను.
మరోవైపు, ఇపుడు నాకు డబ్బులు ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే ఆ డబ్బులతోనే తన కుమార్తె పెళ్లి చేయాల్సివుంది. ఒక్కో ముద్దాయిని ఉరితీస్తే తనకు రూ.25 చొప్పున ఇస్తారు. అంటే నలుగురుని ఉరితీయడం వల్ల వచ్చే లక్ష రూపాయలతో తన కుమార్తె పెళ్లి చేయాల్సివుంది అని చెప్పుకొచ్చరు.
కాగా, పవన్ జలాద్ కుటుంబం తరతరాలుగా తలారుగా పని చేస్తోంది. దీనిపై ఆయన స్పందిస్తూ, ఉరితీసే అవకాశం ఆ దేవుడు ఇచ్చిన వరంగా తాము భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అలాగే, మీరట్ అధికారులు తనకు కాన్షీరామ్ ఆవాస్ యోజన కింద ఒక గది ఇంటిని కేటాయించారని, అదిప్పుడు చాలడం లేదన్నారు.
ఇప్పటికే యూపీ జైలు అధికారుల నుంచి నిర్భయ దోషుల ఉరితీతపై సమాచారం అందిందని, ఉరికి ముందు తాను రిహార్సల్స్ చేయాల్సి వుందని అన్నారు. ప్రస్తుతం తనకు నెలకు కేవలం రూ.5 వేలు మాత్రమే యూపీ జైలు అధికారులు వేతనంగా ఇస్తున్నారని, ఇది కుటుంబ నిర్వహణకు ఎంత మాత్రమూ సరిపోవడం లేదని చెప్పారు. ఇంటిని మరమ్మతులు చేసుకుందామన్న డబ్బులేదని, దోషులను ఉరితీస్తే వచ్చిన డబ్బు తనకు కొత్త ఊపిరిని ఇస్తుందని నమ్ముతున్నట్టు పవన్ జలాద్ చెప్పుకొచ్చారు.