ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నేపాల్ పరుగుల వర్షం కురిపించింది. అసాధ్యమనుకున్న రికార్డును బ్రేక్ చేసింది. క్రికెట్ పసికూన అయిన నేపాల్ మంగోలియాతో తలపడింది. మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 314 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇక్కడే రికార్డుల వేట మొదలైంది.
అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఇదే అత్యధిక స్కోరు. అంతేకాదు, ఈ ఇన్నింగ్స్‌లో 26 సిక్స్‌ను నమోదు చేసుకుంది. తద్వారా అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగానూ రికార్డు సృష్టించింది. అలాగే నేపాల్ బ్యాట్స్ మన్ దీపేంద్ర సింగ్ ఐరీ కేవలం 9 బంతుల్లోనే 50 పరుగులు చేసి ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. మొత్తమ్మీద ఐరీ 10 బంతుల్లో 52 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పేరిట వున్న రికార్డును బ్రేక్ చేశాడు.
మంగోలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో నేపాల్ ఆటగాడు కుశాల్ మల్లా భారీ సెంచరీ నమోదు చేసుకున్నాడు. కేవలం 50 బంతుల్లో 137 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 8 ఫోర్లు, 12 భారీ సిక్సులు ఉన్నాయి.
కెప్టెన్ రోహిత్ పౌడెల్ 27 బంతుల్లో 61 పరుగులు చేశాడు. 315 పరుగుల భారీ లక్ష్యఛేదనలో మంగోలియా 13.1 ఓవర్లలో 41 పరుగులకే కుప్పకూలింది. తద్వారా నేపాల్ 273 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.