Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీసీసీఐకు షాకిచ్చిన ద్రవిడ్.. కొత్త కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్!!

rahul dravid

ఠాగూర్

, బుధవారం, 15 మే 2024 (13:45 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు రాహుల్ ద్రావిడ్ షాకిచ్చారు. భారత క్రికెట్ జట్టుకు మరోమారు కోచ్‌గా ఉండేందుకు ఆయన నిరాకరించారు. దీంతో కొత్త కోచ్‌ కోసం బీసీసీఐ వేట మొదలుపెట్టింది. ఇందుకోసం బీసీసీఐ ఓ ప్రకటన కూడా జారీచేసింది. అవసరమైతే ద్రవిడ్‌ కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. మరోవైపు ద్రవిడ్‌ ఈ సారి టీ20 ప్రపంచ కప్‌ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కోచ్‌ పదవి నుంచి వైదొలగాలని బలంగా నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది.
 
ద్రవిడ్‌ కోచ్‌ పదవికి ఎటువంటి దరఖాస్తు పంపించదల్చుకోలేదని ఓ ఆంగ్లపత్రిక కథనంలో పేర్కొంది. అతడు పొడిగింపును కూడా కోరుకోవడంలేదని వెల్లడించింది. భారత జట్టులోని కొందరు సీనియర్లు ద్రవిడ్‌ను సంప్రదించి కనీసం టెస్టు జట్టుకు మరో ఏడాది పాటు కోచ్‌గా కొనసాగాలని అడిగినట్లు దానిలో పేర్కొంది. 
 
ఈ ప్రతిపాదనను ఆయన తిరస్కరించినట్లు సమాచారం. 2023 ప్రపంచ కప్‌ తర్వాత తనకు లభించిన పొడిగింపునకు మించి కొనసాగ కూడదని బలంగా నిర్ణయించుకొన్నట్లు అర్థమవుతోంది. ఒక వేళ అతడు అంగీకరిస్తే ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌లను నియమించవచ్చని తెలుస్తోంది. కానీ, ఇప్పుడు ఆ అవసరం జట్టు యాజమాన్యానికి లేదు. 
 
కొత్త కోచ్‌ కోసం వేట ఇప్పుడే మొదలైంది. ఎన్‌సీఏ డైరెక్టర్‌ హోదాలో పనిచేస్తున్న వీవీఎస్‌ లక్ష్మణ్‌ పేరు రేసులో వినిపిస్తోంది. గతంలో ద్రవిడ్‌ గైర్హాజరీలో జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది. కాకపోతే టాప్‌ అభ్యర్థుల జాబితాలో ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే విదేశీ కోచ్‌లను నియమించుకొనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఇటీవల బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. 
 
'హెడ్‌ కోచ్‌ భారతీయుడా, విదేశీయుడా అనే విషయాన్ని మేం చెప్పలేం. అది పూర్తిగా సీఏసీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది' అని వ్యాఖ్యానించాడు. విదేశీ అభ్యర్థుల జాబితాలో స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, రికీ పాంటింగ్‌, జస్టిన్‌ లాంగర్‌ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 
 
మరోవైపు, టీమ్‌ ఇండియా పురుషుల విభాగం హెడ్‌ కోచ్‌ పదవికి బీసీసీఐ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా లింక్‌ను ఎక్స్‌లో అందుబాటులో ఉంచింది. క్రికెట్‌ అభిమానులు కూడా దీనికి దరఖాస్తు చేసుకొని.. ఆ స్క్రీన్ షాట్‌ను బీసీసీఐ ఎక్స్‌పోస్టు కామెంట్ల సెక్షన్‌లో పంచుకొంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ 2024 : వర్షంతో గుజరాత్ కథ ముగిసింది.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్