Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రికెటర్లది ఉక్కులాంటి సంకల్పం : టీమిండియా విజయంపై ప్రధాని మోడీ

క్రికెటర్లది ఉక్కులాంటి సంకల్పం : టీమిండియా విజయంపై ప్రధాని మోడీ
, మంగళవారం, 19 జనవరి 2021 (17:08 IST)
ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా ఏమాత్రం అచ్చిరాని గబ్బా స్టేడియంలో ఆసీస్‌ను చిత్తు చేయడం అసాధారణ విషయంగా పలువురు భారత క్రికెటర్లు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆసీస్‌పై టీమిండియా సాధించిన విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. 
 
ఆస్ట్రేలియాలో భారత జట్టు జైత్రయాత్రను అందరం బాగా ఆస్వాదించామన్నారు. ఈ పర్యటన ఆసాంతం భారత ఆటగాళ్ల తపన, తరగని ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపించాయన్నారు. ఉక్కులాంటి సంకల్పం, సడలని దీక్ష కూడా ప్రస్ఫుటమయ్యాయని మోడీ వివరించారు. ఈ సందర్భంగా టీమిండియాకు శుభాభినందనలు తెలియజేస్తున్నానని, భవిష్యత్‌లోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని ట్వీట్ చేశారు.
 
అలాగే, వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి కూడా స్పందించారు. అడిలైడ్‌లో జరిగిన టెస్టులో కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయిన భారత జట్టు చివరికి 2-1తో టెస్టు సిరీస్ లో టీమిండియానే విజేతగా నిలవడం అపూర్వం అని కొనియాడారు. గొప్పగా పుంజుకోవడం అంటే ఇదేనని ట్వీట్ చేశారు. ఓ మ్యాచ్‌లో 36 పరుగులకే ఆలౌట్ అవడం ఎక్కడ... పెద్ద ఆటగాళ్లు లేకుండానే ఏకంగా సిరీస్‌నే చేజిక్కించుకోవడం ఎక్కడ అంటూ వ్యాఖ్యానించారు. 
 
భారత ఆటగాళ్లు ఈ సిరీస్‌లో ఓ జట్టుగా అసమాన స్ఫూర్తి ప్రదర్శించారని కొనియాడారు. అటు, విపక్షనేత చంద్రబాబునాయుడు స్పందిస్తూ, టీమిండియాకు అభినందనలు తెలిపారు. ఆస్ట్రేలియా కంచుకోట గబ్బాలో చిరస్మరణీయ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకున్నారని ప్రశంసించారు.
 
ఇకపోతే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా టీమిండియా ఘనవిజయం పట్ల ట్వీట్ చేశారు. మరోసారి చరిత్ర సృష్టించారని కొనియాడారు. గబ్బాలో జయకేతనం ఎగురవేశారని, 2-1తో సిరీస్‌ను వశం చేసుకున్నారని తెలిపారు. ఇంకా ఆ మైకంలోనే ఉన్నానని, ఈ రోజును చాన్నాళ్లు గుర్తుంచుకుంటానని అన్నారు. ఎనలేని సంతోషం కలుగుతోందని, టీమిండియా నమోదు చేసిన విజయం పట్ల గర్విస్తున్నానని మహేశ్ పేర్కొన్నారు.
 
కాగా, ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ నజరానా?