ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఇద్దరు క్రికెటర్లను తన భార్య వద్దకు రానివ్వరని చెప్పారు.
కాగా, ఇద్దరు క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలపై నలువైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీంతో వారిపై బీసీసీఐ కూడా నిషేధం వేటు వేసింది. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ, 'నా పక్కన నా భార్య, కుమార్తె ఉంటే, వీరిద్దరితో నేను ప్రయాణించను. వీరు కేవలం ఒకే కోణంలో మహిళలను చూస్తారంటే, ఏమనుకోవాలి? వారి తీరు సరికాదు' అని వ్యాఖ్యానించారు.
వారి వ్యాఖ్యలు క్రికెటర్లందరికీ వర్తింప చేయవద్దని అంటూనే, వారి మాటలు మొత్తం క్రికెట్ పరువు తీశాయని భజ్జీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు టీవీ షోలు చూస్తున్న వారంతా, హర్భజన్ కూడా ఇలాగే ఉంటాడేమో? గతంలో లక్షణ్, సచిన్ కూడా ఇలాగేనేమో? అని అనుకుంటున్నారని హర్భజన్ వ్యాఖ్యానించాడు.
కాగా, కాఫీ విత్ కరణ్ అనే టీవీ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్, పాండ్యాలు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి, తమ కెరీర్‌ను ప్రమాదంలో పడేసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరిపై అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సస్పెండై, ఆస్ట్రేలియాతో సిరీస్‌కు దూరమై, ఇంటికి తిరిగొచ్చారు.