శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ-20 పోటీలో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలుపును నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ధీటుగా ఆడిన రోహిత్ శర్మ 50 పరుగులు సాధించాడు. తద్వారా ఇప్పటివరకు ఆడిన ట్వంటీ-20 మ్యాచ్‌ల ద్వారా2288 పరుగులు సాధించాడు. తద్వారా టీ-20ల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ రికార్డ్ సృష్టించాడు.
ఇంతకుముందు కివీస్ క్రికెటర్ మార్టిన్ గుప్తిల్ 2272 పరుగులతో అగ్రస్థానంలో నిలవగా, గుప్తిల్ తర్వాతి స్థానంలో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2263 పరుగులతో నిలిచాడు. వీరిద్దరికి తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 2167 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు. తాజాగా 2288 పరుగులతో ఈ ముగ్గురిని వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇంకా టీ-20ల్లో 20 అర్థ సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.
ఇంకా టీ-20ల్లో 100 సిక్సర్లు సాధించిన మూడో క్రికెటర్‌గానూ రోహిత్ రికార్డు సృష్టించాడు. టీ-20 సిక్సర్లు సాధించిన జాబితాలో గుప్తిల్ (103), క్రిస్ గేల్ (102) తొలి రెండు స్థానాలను కైవసం చేసుకోగా, 100 సిక్సర్లతో రోహిత్ మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంకా మూడు ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు సాధించిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ 349 సిక్సర్లతో నాలుగో స్థానంలో నిలిచాడు.
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు హిట్ మ్యాన్ అనే పేరుంది. ఈ క్రమంలో కివీస్‌తో జరిగిన రెండో టీ-20లో 92 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గానూ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు గుప్తిల్ 74 ఇన్నింగ్స్‌లలో 2272 పరుగులు సాధించి అగ్రస్థానంలో వుండగా, అతనిని వెనక్కి నెట్టిన రోహిత్ శర్మ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.