ఐపీఎల్ 2025 సీజన్ పోటీల్లో భాగంగా గురువారం జరిగిన జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు చేతిలో రాజస్థాన్ రాయల్స్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 117 రన్స్‌కే ఆలౌట్ అయింది. దీంతో 100 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో తొలుత బ్యాట్‌తో ఆ తర్వాత బంతితోనూ రాణించిన ముంబైకి ఈ సీజన్‌లో ఇది వరుసగా ఆరో విజయం కావడం గమనార్హం.
ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన పోరులో రాజస్థాన్ సమిష్టిగా విఫలమైంది. ఆడిన 11 మ్యాచ్‌లకు గాను ఎనిమిదింటిలో ఓడిన ఆర్ఆర్ ప్లే ఆఫ్స్‌కు రేసు నుంచి నిష్క్రమించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ నిర్ణీయ 20 ఓవర్లలో రెండు వికెట్ల మాత్రమే కోల్పోయి 217 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో ఓపెనర్లు రోహిత్ శర్మ 36 బంతుల్లో 53 పరుగులు, రికెల్టన్ 38 బంతుల్లో 61 పరుగులతో రాణించారు. ఈ ద్వయం తొలి వికెట్‌కు ఏకంగా 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఆ తర్వాత ఛేదనలో రాజస్థాన్ 16.1 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. ఏ దశలోనూ లక్ష్య ఛేదన వైపు రాజస్థాన్ కొనసాగలేదు. గత మ్యాచ్‌లో ఫాస్టెస్టచ్ సెంచరీ చేసి క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచిన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. అలాగే మంచి ఫామ్‌లో ఉన్న మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ కూడా 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.
ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా క్రీజ్‌లో కుదురుకోలేకపోడంతో 76 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి చివరికి రాజస్థాన్ రాయల్స్ జట్టు 16.1 ఓవర్లలో 117 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ముంబై బౌలర్లలో కర్ణ్ శర్మ 3, బౌల్ట్ 3, బుమ్రా 2 చొప్పున వికెట్లు తీశారు. ఈ విజయంతో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో దూసుకెళ్లింది.