Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాయకా.. నేనూ నీ వెంటే : క్రికెట్‌కు బై చెప్పిన సురేష్ రైనా

నాయకా.. నేనూ నీ వెంటే : క్రికెట్‌కు బై చెప్పిన సురేష్ రైనా
, ఆదివారం, 16 ఆగస్టు 2020 (12:34 IST)
తనకు అత్యంత ఇష్టమైన, ప్రీతిపాత్రమైన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని క్షణాలకే భారత క్రికెట్ జట్టు మెరుపు ఫీల్డర్, బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా కూడా కెరీర్‌కు బైబై చెప్పేశాడు. మహీకి ఉన్న మంచి స్నేహతుల్లో సురేష్ రైనా ఒకరు. అందుకే, తన స్నేహితుడు, తన నాయుడిని సురేష్ రైనా అనుసరించాడు. 
 
ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించిన కొద్ది నిమిషాలకే అతను కూడా అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించాడు. 'నీతో కలసి ఆడడం కంటే మించింది ఏదీ లేదు. ఎంతో గర్వంగా.. ఈ ప్రయాణంలో నీతో కలసి నడవాలనుకుంటున్నా. భారతావనికి కృతజ్ఞతలు. జైహింద్' అని రైనా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు. అయితే, వచ్చే నెలలో జరగనున్న ఐపీఎల్‌లో రైనా ఆడనున్నాడు. అయితే ఈ యూపీ ప్లేయర్‌ తన చివరి టెస్టును 2015లో ఆడగా.. వన్డే, టీ20లకు 2018లో దూరమయ్యాడు.
 
33 ఏళ్ల సురేష్ రైనా భారత అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడిగా నిలిచాడు. ఎంత క్లిష్టమైన క్యాచ్‌లనైనా ఒడుపుగా పట్టడంలో దిట్ట. ఫీల్డింగ్‌ సమయంలో అతడి వద్దకు బంతి వెళ్లిందంటే ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ రన్స్‌ చేసేందుకు తటపటాయించాల్సిందే. అవసరమైనప్పుడు బంతితోనూ ఆదుకొనేవాడు. అలాగే మిడిల్డార్‌ బ్యాట్స్‌మన్‌గానూ రాణించాడు. 
 
టెస్ట్‌ల్లో రైనా అంతగా ఆకట్టుకోలేకపో యినా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. పొట్టి ఫార్మాట్‌లో శతకం (101) బాదిన ప్లేయర్లలో రైనా ఒకడు. భారత జగజ్జేతగా నిలిచిన 2011 వరల్డ్‌క్‌పతో పాటు 2013 చాంపియన్స్‌ ట్రోఫీ నెగ్గిన జట్టులో రైనా సభ్యుడు. మూడు ఫార్మాట్లలోనూ శతకాలు నమోదు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు.
webdunia
 
ధోనీతో రైనాకు విడదీయరాని అనుబంధం ఉంది. టీమిండియాలో సురేష్‌ నిలదొక్కుకున్నాడంటే అంతా ధోనీ వల్లే. మహీ కూడా రైనాను తన కుడి భుజంగా భావించేవాడు. ఎక్కువగా అవకాశాలు రైనాకే ఇచ్చేవాడు. ఐపీఎల్‌లో అయితే చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున ఆరంభం నుంచి ఆడుతూనే ఉన్నారు. చెన్నై అభిమానులైతే మహీని పెద్ద తల (పెద్ద నాయకుడు) అంటే.. రైనాను చిన్న తల (చిన్న నేత) అని పిలుచుకుంటారు. పదేళ్లపాటు వీరిద్దరూ ఐపీఎల్‌లో ఒకే టీమ్‌కు ఆడటం కూడా విశేషం. అందుకే ధోనీ లేని అంతర్జాతీయ క్రికెట్‌లో తాను ఉండకూడదని భావించిన రైనా.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 
 
అయితే, భారత్‌ 73 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకొని 74వ ఏడాదిలోకి అడుగు పెట్టిన రోజునే '7' నెంబర్‌ జెర్సీ గల ధోనీ, '3' నెంబర్‌ జెర్సీ గల రైనా రిటైరవడంతో అభిమానులు ఈ రెండు అంశాలకు (73-7,3) పోలిక పెడుతూ పోస్టులు పెడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఒకే ఒక్కడు'.. "సరిలేరు నీకెవ్వరు" అంటున్న నెటిజన్లు