Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేనిక విరమిస్తాను.. ఎం.ఎస్.ధోనీ .. 7.29 గంటలకే ఎందుకు?

Advertiesment
నేనిక విరమిస్తాను.. ఎం.ఎస్.ధోనీ .. 7.29 గంటలకే ఎందుకు?
, ఆదివారం, 16 ఆగస్టు 2020 (11:59 IST)
భారత క్రికెట్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న మహేంద్రసింగ్‌ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా శనివారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేసి కేవలం సింగిల్‌ లైన్‌తో తన ఉద్దేశం తెలిపాడు. 
 
'కెరీర్‌ ఆద్యంతం నన్ను ప్రేమించడంతో పాటు మద్దతుగా నిలిచిన మీ అందరికీ కృతజ్ఞతలు. రాత్రి 7.29 నుంచి ఇక నేను రిటైర్‌ అయినట్టుగా భావించండి' అని 39 ఏళ్ల ఈ మాజీ కెప్టెన్‌ క్లుప్తంగా పేర్కొన్నాడు. 2004లో కెరీర్‌ను ఆరంభించిన మహీ గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై చివరి మ్యాచ్‌ ఆడాడు. 
 
అప్పుడే ధోనీ వీడ్కోలుపై కథనాలు వెలువడినా అతను మాత్రం స్పందించలేదు. అటు ఫ్యాన్స్‌ కూడా కచ్చితంగా టీ20 ప్రపంచకప్‌ ఆడతాడని నమ్మకంగా ఉన్నారు. కానీ ఎవరి అంచనాలకు అందని ఎంఎస్‌ తన స్టయిల్లోనే అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు.
 
తన వ్యవహారశైలి ఎవరికీ అర్థం కాని విధంగా ఉండే ఎంఎస్‌ ధోనీ చివరికి తన వీడ్కోలు పత్రాన్ని కూడా విభిన్నంగా ఉండేలా చూసుకున్నాడు. ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌గా కభీ కభీ సినిమాలో ముకేశ్‌ కుమార్‌ ఆలపించిన 'మే పల్‌దో పల్‌కా షాయర్‌ హూ, పల్‌దో పల్‌ మేరీ కహానీ హై' అనే పాటను ఉంచాడు. 
 
4:07 ని.ల పాటు ఉన్న వీడియోలో తన కెరీర్‌ ఆరంభం నుంచి కివీస్‌తో చివరి మ్యాచ్‌లో రనౌట్‌ అయిన దృశ్యం వరకు ఉంచాడు. అయితే ఆ పాటను కూడా సందర్భోచితంగా ఉండేలా చూసుకున్నాడు. 'కేవలం నేను ఒకటి రెండు ఘడియలపాటు ఉండే కవిని మాత్రమే.. నాకన్నా ముందు ఎంతో మంది వచ్చారు.. వెళ్లారు.. నా ఉనికి కూడా వారందరిలాంటిదే...ఆ కాస్తకాలం పూర్తయింది. నేనిక విరమిస్తాను.. అంటూ ధోనీ తన మనోభావాన్ని సినిమా పాట ద్వారా నర్మగర్భంగా తెలిపాడు. 
 
ఆరేళ్ల క్రితం కూడా భారత జట్టు ఆసీస్‌ పర్యటనలో ఉన్నప్పుడు హఠాత్తుగా ధోనీ టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. టెస్టు సిరీస్‌ మధ్యలోనే అతను నిర్ణయం ప్రకటించగా.. ఆ వెంటనే కోహ్లీకి పగ్గాలు అప్పజెప్పాడు. అప్పటి నుంచి పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. 2013లో వన్డే పగ్గాలు కూడా కోహ్లీకి అప్పగించాడు. 350 వన్డేల్లో 10,733 పరుగులు చేసిన ధోనీ భారత్‌ నుంచి అత్యధిక వ్యక్తిగత రన్స్‌ చేసిన  ఐదోవాడిగా నిలిచాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్లీజ్.. ధోనీ కోసం ఒక్క వీడ్కోలు మ్యాచ్ పెట్టండి.. జార్ఖండ్ సీఎం