భారత్-కివీస్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ తర్వాత మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం ప్రపంచంలోనే నెం.1 బౌలర్ గా నిలిచాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో ఈ ఫాస్ట్ బౌలర్ తొలి స్థానం ఆక్రమించాడు. గత ఏడాది కాలంలో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఎట్టకేలకు అతడికి బహుమతి లభించింది.
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ను వెనక్కి నెట్టి సిరాజ్ మొదటి స్థానాన్ని సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో సిరాజ్ నంబర్‌వన్‌గా నిలవడం ఇదే తొలిసారి. మొహమ్మద్ సిరాజ్ 2019 సంవత్సరంలో తన వన్డే అరంగేట్రం చేశాడు. అయితే కొంతకాలం తర్వాత అతను జట్టు నుంచి తొలగించబడ్డాడు.
గత ఏడాది ఫిబ్రవరిలో సిరాజ్ ఈ ఫార్మాట్ లో పునరాగమనం చేశాడు. అప్పటి నుంచి టీమిండియాకు బలమైన బౌలర్ గా ఎదిగాడు. సిరాజ్ ఇప్పటివరకు 20 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటివరకు అతను 37 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.