క్రికెట్ ప్రపంచంలో భారత మాజీ కెప్టెన్, క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ మహోన్నత శిఖరాన్ని అధిరోహించారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఇంతకాలం ఉన్న రికార్డును సమం చేశారు. వన్డే క్రికెట్ ప్రపంచంలో అత్యధిక సెంచరీలు (49) చేసిన రికార్డు సచిన్ పేరిట ఉండగా, దాన్ని విరాట్ కోహ్లీ సమం చేశాడు. ఆదివారం కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికా వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఫీట్‌ను సాధించారు.
వన్డేల్లో సచిన్ టెండూల్కర్ నమోదు చేసిన 49 సెంచరీల రికార్డును ఆదివారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ద్వారా కోహ్లీ అందుకున్నాడు. సచిన్ 452 ఇన్నింగ్స్‌లలో 49 సెంచరీలు చేయగా... కోహ్లీ కేవలం 277 ఇన్నింగ్స్‌ల్లోనే 49 సెంచరీలు చేసి ఔరా అనిపించాడు. అది కూడా తన పుట్టినరోజు నాడే ఈ అరుదైన ఫీట్‌ను అందుకోవడం అతని జీవితంలో చిరస్మరణీయమైన రోజుగా నిలించింది.
ఈ జాబితాలో సచిన్, కోహ్లీ తర్వాత స్థానంలో ఉన్న రోహిత్ శర్మ ఇంకా 31 సెంచరీల వద్దే ఉన్నాడంటే కోహ్లీ గొప్పదనం ఏంటో అర్థమవుతుంది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 119 బంతుల్లో 100 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 10 ఫోర్లు ఉన్నాయి. మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా కూడా ధాటిగా ఆడడంతో టీమిండియా 300 మార్కు దాటింది.
నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. కోహ్లీ 101 పరుగులతో అజేయంగా నిలవగా, జడేజా 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 29 (నాటౌట్) పరుగులు సాధించాడు. అంతకుముందు, శ్రేయాస్ అయ్యర్ అర్ధసెంచరీతో రాణించాడు. అయ్యర్ 87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77 పరుగులు చేశాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ 40, శుభ్‌మన్ గిల్ 23 పరుగులు చేశారు. కేఎల్ రాహుల్ 8, సూర్యకుమార్ యాదవ్ 22 పరుగులకు అవుటయ్యారు. సఫారీ బౌలర్లలో ఎంగిడి, యన్సెన్, రబాడా, కేశవ్ మహరాజ్, షంసీ తలో వికెట్ పడగొట్టారు