ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు సొంతగడ్డపై తొలి ఓటమిని చవిచూసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీని గుజరాత్ టైటాన్స్ జట్టు చిత్తుగా ఓడించింది. 170 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాస విజయాన్న సాధించింది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగుళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆ జట్టులో లివింగ్ స్టోన్ 54, జితేశ్ శర్మ 33 పరుగులతో రాణించగా, పడిక్కల్ 04, కోహ్లీ 07, రజత్ పాటీదార్ 12, ఫీల్ సాల్ట్ 14 చొప్పున పరుగులు చేసి నిరాశపరిచారు. మ్యాచ్ ఆకరులో టిమ్ డేవిడ్ 32 పరుగులతో మెరుపులు మెరిపించడంతో బెంగుళూరు జట్టు ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3, సాయి కిషోర్ 2 పడగొట్టగా, ఇషాంత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షద్‌లు తలా వికెట్ చొప్పున తీశారు.
ఆ తర్వాత 170 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు మరో 13 బంతులు మిగిలివుండగానే విజయాన్ని చేరుకుంది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ సాయి సుదర్శన్ 49, జాస్ బట్లర్ 73తో తమ బ్యాట్‌లకు పని చెప్పడంతో 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హేజిల్ వుడ్‌లు తలో వికెట్ పడగొట్టారు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 19 పరుగులు ఇచ్చి కీలకమైన మూడు వికెట్లు తీసిన గుజరాత్ బౌలర్ సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.