స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2024 పోటీల్లో భాగంగా, రాజస్థాన్ జట్టు విజయభేరీ మోగించింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్ యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ బ్యాట్‌తో రాణించడంతో ఆ జట్టు సునాయాస విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థి ముంబై జట్టు నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 18.4 ఓవర్లలోనే ఛేదించి 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జైస్వాల్ అజేయ సెంచరీతో పాటు జాస్ బట్లర్ (35), సంజూ శాంసన్ (38) చొప్పున పరుగులు చేశారు.
ముంబై బౌలర్లలో స్పిన్నర్ పీయూష్ చావ్లాకు మాత్రమే ఒక వికెట్ దక్కింది. మిగతా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. దీంతో జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్‌పై విజయం సాధించాలనుకున్న ముంబై ఇండియన్స్‌కు మరోమారు తీవ్ర నిరాశ ఎదురైంది. 2012 నుంచి జైపూరులో రాజస్థాన్ని ముంబై ఇండియన్స్ ఓడించలేకపోయింది.
ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. తిలక్ వర్మ(64), నెహల్ వధేర (49) రాణించారు. ముంబైకి ఆరంభంలో ఎదురుదెబ్బలు తగిలాయి. మొదటి ఎనిమిది ఓవర్లలోనే ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ ధాటికి రోహిత్ శర్మ రూపంలో తొలి ఓవర్లోనే వికెట్ పడింది. ఈ మ్యాచ్‌లో సందీప్ శర్మ 5 వికెట్లతో చెలరేగాడు. బౌల్టికి 2, అవేశ్ ఖాన్, చాహల్‌కు చెరో వికెట్ పడింది. ఈ మ్యాచ్ ఐపీఎల్లో 200వ వికెట్ మైలురాయిని అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో సెంచరీ ద్వారా ఐపీఎల్లో అతిపిన్న వయసులోనే 2 సెంచరీలు బాదిన ఆటగాడిగా యశస్వి జైస్వాల్ నిలిచాడు. 23 ఏళ్లు నిండకముందే ఈ ఫీట్‌ను సాధించాడు. కాగా ముంబైపై మ్యాచ్ 59 బంతుల్లోనే జైస్వాల్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 60 బంతులు ఎదుర్కొని 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి.