ఐసీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన రెండో మ్యాచ్‌లో పంజాబ్ జట్టు మరోమారు బోల్తాపడింది. ప్రత్యర్థి జట్టు తమ ముందు ఉంచిన స్వల్ప విజయలక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిలపడింది. పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రత్యర్థి జట్టు కేవలం 143 పరుగుల లక్ష్యమే నిర్దేశించింది. అయినా సరే.. చిన్న లక్ష్యాన్ని కాపాడుకునేందుకు పంజాబ్ గట్టిగానే పోరాడింది. కానీ ఒత్తిడిలో రాహుల్ తెవాతియా (36 నాటౌట్, 18 బంతుల్లో 7x4) సూపర్ ఇన్నింగ్స్ ఆడడంతో టైటాన్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మొదట పంజాబ్ 20 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటైంది. సింగ్ (35, 21 బంతుల్లో 3x4, 3x6) టాప్ స్కోరర్. స్పిన్నర్లు సాయికిశోర్ (4/33), నూర్ అహ్మద్ (2/20), రషీద్ ఖాన్ (1/15) ఆ జట్టును దెబ్బతీశారు. మోహిత్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. తెవాతియాతో పాటు గిల్ (35, 29 బంతుల్లో 5x4) రాణించడంతో లక్ష్యాన్ని టైటాన్స్ 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హర్షల్ పటేల్ (3/15), లివింగ్స్టన్ (2/19) బంతితో రాణించారు. ఆరో పరాజయంతో ప్లేఆఫ్స్ అవకాశాలను పంజాబ్ మరింత సంక్లిష్టం చేసుకుంది.
లక్ష్యం చిన్నదే అయినా గుజరాత్ చెమటోడ్చింది. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు తేలికగా రాలేదు. గిల్, సాయిసుదర్శన్ (31, 34 బంతుల్లో 3x4) రాణించినా.. ధాటిగా ఆడలేదు. సాహా (13), మిల్లర్ (4), అజ్మతుల్లా (13) విఫలమయ్యారు. 16 ఓవర్లకు టైటాన్స్ స్కోరు 105/5. చివరి 4 ఓవర్లలో 38 పరుగులు చేయాల్సి స్థితిలో ఆ జట్టుపై ఒత్తిడి పెరిగింది. పంజాబ్‌లో ఆశలు చిగురించాయి. కానీ తెవాతియా అదిరే బ్యాటింగ్ ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు. అతడు బ్రార్ బౌలింగ్ రెండు ఫోర్లు, రబాడ ఓవర్లో మూడు ఫోర్లు బాదడంతో మ్యాచ్ పూర్తిగా టైటాన్స్ వైపు తిరిగింది.
చివరి రెండు ఓవర్లలో ఐదు పరుగులు చేయాల్సిన స్థితిలో గుజరాత్ లక్ష్యం చాలా తేలికైపోయింది. షారుక్ (8), రషీద్ (3) ఔటైనా.. ఆ జట్టుకు కంగారు పడాల్సిన అవసరం లేకపోయింది. అంతకుముందు పంజాబ్ ప్రదర్శన పేలవం. సాయికిశోర్ నేతృత్వంలో టైటాన్స్ స్పిన్నర్లు కింగ్స్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశారు. ఈ సీజన్‌లో పవర్ ప్లేలో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన జట్లలో ఒకటైన పంజాబ్.. నిజానికి ఈసారి మెరుగ్గానే ఆరంభించింది. ప్రభ్సమ్రన్ బ్యాట్ ఝళిపించడంతో 5 ఓవర్లలో 45/0తో నిలిచింది. కానీ ప్రభ్సమ్రన్‌ను మోహిత్ ఔట్ చేశాక పంజాబ్ ఇన్నింగ్స్ గమనమే మారిపోయింది.
ఆ తర్వాత స్పిన్నర్లు ఆ జట్టును కట్టిపడేశారు. రొసో (9)ని నూర్ ఔట్ చేయగా.. ఓపెనర్ సామ్ కరన్ (20)ను రషీద్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. లివింగ్స్టన్ (6) ను నూర్ ఎక్కువసేపు నిలువనివ్వలేదు. ఆ తర్వాత జితేశ్ శర్మ (13), అశుతోష్ శర్మ (3), శశాంక్ సింగ్ (8)లను సాయికిశోర్ వెనక్కి పంపడంతో 16వ ఓవర్లు ముగిసే సరికి 107/7తో నిలిచింది పంజాబ్. ఆఖర్లో హర్ ప్రీత్ బ్రార్ (29; 12 బంతుల్లో 4×4, 1×6) కాస్త బ్యాట్ ఝళిపించడంతో ఆ జట్టు 140 దాటగలిగింది.