జైపూర్ వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9.65 రన్ రేట్‌తో నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఆ తర్వాత 194 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 173 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఎల్.ఎస్.జే జట్టులో ఓపెనర్ డీకాక్ 4, కేఎల్ రాహుల్ 58, పడిక్కల్ 0, బదోని 1, హూడా 26, పూరణ్ 64, స్టాయిన్స్ 3, కృనాల్ పాండ్య 3 చొప్పున పరుగులు చేశారు. కెప్టెన్ కేఎల్ రాహుల్, నికోలస్ పూరణ్, హుడాలు మాత్రమే రెండు అంకెల స్కోరు చేశారు. మిగిలిన ఆటగాళ్లంతా ఇటొచ్చి అటెళ్లిపోయారు.
అంతకుముందు.. రాజస్థాన్ రాయల్ తన తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 193 పరుగులు చేసింది. ఆ జట్టులో జైశ్వాల్ 24, బట్లర్ 11, శాంసన్ 82 (నాటౌట్), పరగ్ 42, హెట్మెయిర్ 5, జురెల్ 20, చొప్పున పరుగులు చేయగా, అదనపు రన్స్ రూపంలో 8 వచ్చాయి. అయితే, డాషింగ్ ఆటగాడు సంజూ శాంసన్ అర్ధ శతకంతో చెలరేగాడు. తద్వారా వరుసగా ఐదు సీజన్ల తొలి మ్యాచ్‌లో సంజూ యాభైకి తగ్గకుండా స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
సిక్సర్ల వీరుడిగా పేరొందిన శాంసన్ ఐపీఎల్ 2020 ఎడిషన్ నుంచి ఫస్ట్ మ్యాచ్‌లో కనీసం హాఫ్ సెంచరీ బాదేస్తున్నాడు. 2020లో చెన్నై సూపర్ కింగ్స్‌పై సంజూ 34 బంతుల్లోనే 74 రన్స్ కొట్టాడు. 2021లో పంజాబ్ కింగ్స్‌పై ఏకంగా సెంచరీతో కదం తొక్కాడు. ఆ మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించిన ఈ పవర్ హిట్టర్ 63 బంతుల్లోనే 119 రన్స్ కొట్టేశాడు.