Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్ 2024 విజేతగా కోల్‌‍కతా - రూ.20 కోట్ల ప్రైజ్

kkr team

ఠాగూర్

, ఆదివారం, 26 మే 2024 (22:48 IST)
చెన్నై వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ పోటీ ఏకపక్షంగా సాగింది. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైంది. దీంతో ప్రత్యర్థి కోల్‌కతా జట్టు మరోమారు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఈ జట్టు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. దీంతో ఈ జట్టు రూ.20 కోట్ల ప్రైజ్ మనీని అందుకోనుంది. రన్నరప్‌‌‍గా నిలించిన హైదరాబాద్ జట్టుకు రూ.13 కోట్ల ప్రైజ్ మనీని ఇవ్వనున్నారు. 
 
కాగా, ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ టైటిల్ సమరంలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ స్వల్ప స్కోరును కాపాడుకునేందుకు సన్ రైజర్స్ విఫలయత్నం చేసింది. 114 పరుగుల విజయలక్ష్యాన్ని కోల్కతా జట్టు 10.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెంకటేశ్ అయ్యర్ విధ్వంసక ఇన్నింగ్స్‌‍తో కోల్ కతా విజయంలో కీలకపాత్ర పోషించాడు. వెంకటేశ్ అయ్యర్ 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. 
 
మరో ఎండ్‌లో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. గుర్బాజ్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 39 పరుగులు చేశాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 6 (నాటౌట్) పరుగులు చేశాడు. అంతకుముందు, ఓపెనర్ సునీల్ నరైన్ 6 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఈ విజయంతో కోల్‌కతా నైట్ రైడర్స్ పదేళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్ విజేతగా నిలిచింది. 
 
ఇదిలావుంటే, తమ జట్టు ఫైనల్ మెట్టు వరకు వచ్చి ఓటమిపాలవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని కావ్యా మారన్ కన్నీటిపర్యంతమయ్యారు. ఉబికి వస్తున్న కన్నీటిని దాచలేక, ఆమె కెమెరాలకు కనిపించకుండా ఉండేందుకు అవతలి వైపుకు తిరిగి నిలుచున్నారు. కన్నీటిని తుడుచుకుంటూ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

IPL 2024 Final: ఐపీఎల్ కప్ KKRదే, 8 వికెట్ల తేడాతో SRH పైన ఘన విజయం