ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బౌలర్లు అద్భుత ప్రతిభను కనపరిచారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ళు చేతులెత్తేశారు. ఫలితంగా 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయింది. టాపార్డర్ వైఫల్యం బ్యాటింగ్‌ను దెబ్బతీసింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న ఈ అంతిమ సమరంలో సన్ రైజర్స్ గెలవాలంటే బౌలర్లు ఏదైనా అద్భుతం చేయాల్సిందే.
ఈ సీజన్‌లో ఊపుమీదున్న కోల్‌కతా పేసర్ మిచెల్ స్టార్క్ నుంచి ట్రావిస్ హెడ్ వికెట్‌ను కాపాడేందుకు తాను స్ట్రయికింగ్ తీసుకున్న అభిషేక్ శర్మ... తన వికెట్‌ను కాపాడుకోలేకపోయాడు. కేవలం 2 పరుగులు చేసిన అభిషేక్ శర్మ... స్టార్క్ విసిరిన ఓ అద్భుతమైన అవుట్ స్వింగర్‌కు బలయ్యాడు.
ఆ తర్వాతి ఓవర్‌లోనే హెడ్ (0) డకౌట్ అయ్యాడు. ఈ వికెట్ వైభవ్ అరోరాకి దక్కింది. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి (9)ని కూడా ఔట్ చేసిన స్టార్క్ సన్ రైజర్స్‌ను గట్టి దెబ్బకొట్టాడు. ఈ దశలో ఐడెన్ మార్ క్రమ్ (20), నితీశ్ రెడ్డి (13) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా అది కాసేపే అయింది. క్లాసెన్ (16) మరోసారి ఆదుకుంటాడని అనుకుంటే.. ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. షాబాజ్ అహ్మద్ (8) కూడా నిరాశపరిచాడు. మ్యాచ్ ఆఖరులో కెప్టెన్ పాట్ కమిన్స్ 19 బంతుల్లో 24 పరుగులు చేయడంతో సన్ రైజర్స్ స్కోరు కనీసం 100 పరుగుల మార్కును దాటింది.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అబ్దుల్ సమద్ 4 పరుగులకే వెనుదిరిగాడు. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రీ రసెల్ 3, మిచెల్ స్టార్క్ 2, హర్షిత్ రాణా 2, వైభవ్ అరోరా 1, సునీల్ నరైన్ 1, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీశారు.