స్వదేశంలో ఐపీఎల్ 15వ సీజన్ పోటీలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, ఆటగాళ్లను మాత్రం కరోనా వైరస్ వదిలిపెట్టడం లేదు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మరో ఆటగాడికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ జట్టు సభ్యులను క్వారంటైన్‌కు పంపించారు.
నిజానికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మంగళవారం పంజాబ్ కింగ్స్ జట్టుతో తలపడాల్సివుంది. ఈ లోపే ఆ జట్టులోని ఓ ఆటగాడికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఈ మేరకు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో తేలింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తం జట్టును ముంబైలో క్వారంటైన్స్‌కు తరలించారు. అయితే, ఆర్టీపీసీ పరీక్ష ద్వారా కూడా కరోనా పాజిటివ్ ఉందా లేదా అని నిర్ధారణ చేయనున్నట్టు ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించారు. సోమ, మంగళవారాల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.
గత శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో పాట్రిక్ ఫర్హార్‌కు కరోనా పాజిటివ్ ఉన్నట్టు బయటపడడం తెలిసిందే. బయో బబుల్‌లో ఉన్నప్పటికీ కరోనా వైరస్ కేసులు వెలుగు చూడడంతో 2020లోనూ ఐపీఎల్ సగంలో ఆగిపోవడం గుర్తుండే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు క్వారంటైన్ కాలం 3-4 రోజులకు తగ్గిపోయింది. కనుక మరొక రోజు అయినా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ నిర్వహణకు అవకాశాలు ఉంటాయి.