Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్... పాయింట్ల పట్టికలో అగ్రస్థానం

Advertiesment
gujarat titans
, శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (10:51 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 15వ సీజన్ పోటీల్లో భాగంగా, గురువారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ - గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో ఆల్‌రౌండ్ షోతో గుజరాత్ టైటాన్స్ జట్టు అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించింది. ఫలితంగా 37 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ విజయంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టులో ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా వీరబాదుడుకు రాజస్థాన్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. పాండ్యాకు తోడు మిల్లర్ తోడుకావడంతో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఆ తర్వాత 193 పరుగులు భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. 
 
రాజస్థాన్ జట్టులో ఓపెనర్ జోస్ బట్లర్ 24 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ సెంచరీ (54) చేశాడు. జట్టులో అతడు మాత్రమే రాణించాడు. ఆ తర్వాత షిమ్రన్ హెట్మెయిర్ చేసిన 29 పరుగులే రెండో అత్యధికం కావడం గమనార్హం. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ రీతిలో బ్యాట్ ఝళిపించలేకపోయారు. కెప్టెన్ శాంసన్ 11, రియాన్ పరాగ్ 18, నీషమ్ 17 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో యష్ దయాళ్ , లాకీ ఫెర్గ్యూసన్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. 
 
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌కు ఆరంభం కలిసి రాలేదు. 53 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. వేడ్ (12), విజయ్ శంకర్ (2), శుభమన్ గిల్ (13) తీవ్రంగా నిరాశ పరిచారు. అయితే, హార్దిక్ పాండ్యా, అభినవ్ మనోహర్, మిల్లర్‌లు జట్టును ఆదుకున్నారు. 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసి మనోహర్ అవుటయ్యాక మిల్లర్ క్రీజులోకి వచ్చాడు. అతడి రాకతో ఆట స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. పాండ్యా, మిల్లర్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఇద్దరూ కలిసి పోటీలు పడి బౌలర్ల పని పట్టారు. దీంతో స్కోరుబోర్డు పరుగులు తీసింది.
 
పాండ్యా 52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 87, మిల్లర్ 14 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో గుజరాత్ 8 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకోగా, ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న రాజస్థాన్ 6 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. తనకూ అన్ని పాయింట్లే ఉన్నప్పటికీ మెరుగైన రన్‌రేట్ కారణంగా కోల్‌కతా నైట్ రైడర్స్ రెండో స్థానంలో ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌కు దూరమైన దీపక్ చాహర్