ఏడేళ్ల విరామం తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు టెస్టు మ్యాచ్ ఆడబోతోంది. బుధవారం నుంచి ప్రారంభం అయ్యే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో మిథాలీసేన తలపడుతుంది. 2014 తర్వాత భారత్ టెస్టులు ఆడనుండటం ఇదే తొలిసారి కాగా.. ఈ మధ్య కాలంలో మూడు టెస్టులు ఆడిన ఇంగ్లండ్‌దే కాస్త పైచేయిగా కనిపిస్తోంది. అయితే గత పర్యటనలో ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించిన భారత జట్టును తక్కువగా అంచనా వేయలేం.
నాలుగు రోజులు మాత్రమే జరగనున్న ఈ టెస్టు మ్యాచ్ కోసం ఈ నెల 3న ఇంగ్లండ్‌కి చేరుకున్న భారత మహిళల జట్టు.. అక్కడ క్వారంటైన్‌లో ఉండటంతో సన్నద్ధతకి పూర్తి సమయం దొరకలేదు.అయినప్పటికీ ఈరోజు ప్రారంభమయ్యే ఏకైక టెస్టులో భారత జట్టు ఫేవరెట్ అని రికార్డులు చెప్తున్నాయి.
భారత మహిళలు చివరిసారి 2014లో టెస్టు మ్యాచ్ ఆడారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆడిన వారిలో మిథాలీ రాజ్ సహా ఏడుగురు ప్రస్తుత జట్టులో ఉన్నారు. భారత్ ఈ ఏకైక టెస్టు కోసం 18 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. ఇందులో 8 మందికి మాత్రమే గతంలో టెస్టు ఆడిన అనుభవం ఉండగా.. అందరూ ఆడిన మ్యాచ్‌లు కలిపి 30 మాత్రమే.