ఒకవైపు కరోనా సీజన్ భయపెడుతుంటే.. మరోవైపు ఇంగ్లండ్‌లో టెన్నిస్ సీజన్ మొదలుకానుది. వచ్చే నెల 6వ తేదీ నుంచి నాటింగ్‌హామ్ ఓపెన్ టెన్నిస్ సిరీస్ ఆరంభంకానుంది. ఆ ఈవెంట్‌లో భారత టెన్నిస్ స్టార్, హైదరాబాద్ ఏస్ సానియా మీర్జా పాల్గొనున్నది.
అయితే ఇప్పటికే టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఇంగ్లండ్ వెళ్లేందుకు వీసా వచ్చింది. కానీ కరోనా ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఆమె రెండేళ్ల కుమారుడికి మాత్రం వీసా రాలేదు. అంతేకాదు.. సానియా కేర్‌టేకర్‌కు కూడా ఇంకా వీసా జారీ చేయలేదు.
ఇంగ్లండ్‌లో వేరువేరు టోర్నీలు ఆడనున్న సానియా అక్కడే నెల రోజులకుపైగా గడపనున్నది. అయితే నెల రోజుల తన కొడుకును విడిచిపెట్టి ఉండలేనని, అందుకే తన కుమారుడిని కూడా తీసుకువెళ్లేందుకు అనుమతి ఇప్పించాలంటూ కేంద్ర క్రీడాశాఖను సానియా ఆశ్రయించింది.
ఈ నేపథ్యంలో జోక్యం చేసుకున్న క్రీడాశాఖ.. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగశాఖకు చెప్పింది. సానియా కుమారుడికి వీసా ఇప్పించే అంశంపై ఇంగ్లండ్‌తో కేంద్ర విదేశాంగ శాఖ చర్చలు జరుపుతుంది. బ్రిటన్ ప్రభుత్వం అనుమతి ఇస్తుందని ఆశాభావాన్ని క్రీడాశాఖ వ్యక్తం చేసింది.
నాటింగ్‌హామ్ ఓపెన్ తర్వాత.. సానియా అక్కడే 14 నుంచి బర్మింగ్‌హామ్ ఓపెన్, 20 నుంచి ఈస్ట్‌బౌర్న్ ఓపెన్, 28వ తేదీ నుంచి వింబుల్డన్ ఓపెన్‌లో ఆడనున్నది. కాగా సానియా మీర్జా పాకిస్థాన్ కోడలు అయినప్పటికీ.. భారత టెన్నిస్ క్రీడాకారిణిగా ఆడుతున్న విషయం తెల్సిందే.