Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అక్లాండ్ వన్డేలో భారత్‌కు షాకిచ్చిన న్యూజిలాండ్

new zealand team
, శుక్రవారం, 25 నవంబరు 2022 (15:09 IST)
అక్లాండ్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌కు న్యూజిలాండ్ జట్టు తేరుకోలేని షాకిచ్చింది. భారత్ నిర్ధేశించిన 307 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 17 బంతులు మిగిలివుండగానే ఛేదించింది. మొత్తం 47.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసి తొలి వన్డేను తన ఖాతాలో వేసుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడిన భారత్ బ్యాటింగుకు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్‌లు అర్థ శతకాలతో రాణించడంతో భారత్ భారీ స్కోరు చేసింది. 
 
ముఖ్యంగా, శ్రేయాస్ అయ్యర్ బ్యాట్‌కు పని చెప్పాడు. ఫలితంగా 76 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో 80 పరుగులు చేశాడు. తొలుత ఓపెనర్‌లు ధావన్ 77 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 72 పరుగులు చేయగా, మరో ఓపెనర్ గిల్ 65 బంతుల్లో ఓ ఫోర్, మూడు సిక్స్‌ల సాయంతో 50 పరుగులు చేశాడు. ఫలితంగా వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యంతో మంచి పునాది వేశారు. 
 
అయితే, మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్, రిషబ్ పంత్‌లు మరోమారు నిరాశపరిచారు. నాలుగో నంబరుగా బరిలోకి దిగిన పంత్ 23 బంతుల్లో 15 పరుగులు చేయగా, సూర్య కుమార్ 4, సంజూ శాంసన్ 36, వాషింగ్టన్ సుందర్ 37 పరుగులు చేశారు. ఫలితంగా భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ, లోకీ ఫెర్గూసన్‌లు మూడేసి వికెట్లు తీశారు. 
 
ఆ తర్వాత 307 రన్స్ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 3 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. కివీస్ ఓపెనర్లు ఫిన్ అలెన్ 22, కాన్వే 24, కేన్ విలియమ్సన్ 94 (నాటౌట్), మిచెల్ 11, టామ్ లాథమ్ 145 ( నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ముఖ్యంగా, విలియమ్సన్, లాథమ్‌లు క్రీజ్‌లో పాతుకునిపోయి భారత బౌలర్లను ఊచకోత కోశారు. 88 పరుగుల వద్ద మూడో వికెట్ పడగా, ఆ తర్వాత వికెట్ కోల్పోకుండానే విజయలక్ష్యాన్ని చేరుకున్నారు. 
 
ఈ క్రమంలో విలియమ్సన్ 98 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 94 పరుగులు, లాథమ్ 104 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 145 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌ ద్వారా అర్ష్‌దీప్  సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లు అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్లాండ్ వన్డే మ్యాచ్ : శ్రేయాస్ మెరుపులు - భారత్ 306 రన్స్