భారత్-ఆస్ట్రేలియాలో జరుగనున్న పెర్త్ టెస్టుకు భారత స్టార్ క్రికెటర్లు దూరమయ్యారు. దీంతో తొలి టెస్టులో గెలుపును నమోదు చేసుకున్న టీమిండియాకు రెండో టెస్టులో చుక్కలు కనిపించే అవకాశం వుందని క్రీడా పండితులు అంటున్నారు. అడిలైడ్ టెస్టులో ఆరు వికెట్లు పడగొట్టి బిగ్ బాస్‌గా నిలిచిన అశ్విన్.. కొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
గాయం కారణంగా అశ్విన్.. అలాగే స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మలు తప్పుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. శుక్రవారం నుంచి ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టు ప్రారంభం కానుంది. ఉదర సంబంధిత రుగ్మతతో అశ్విన్ తప్పుకోగా, వెన్నునొప్పి కారణంగా రోహిత్ శర్మ తప్పుకుంటున్నట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు.
ఇక ఓపెనర్ పృథ్వీ షా చీలమండ గాయం నుంచి తేరుకోగా, రవిచంద్రన్ అశ్విన్ పెర్త్‌కు దూరమైనా.. హనుమ విహారి, రవీంద్ర జడేజా, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ వంటి బౌలర్లతో 13 మంది సభ్యులతో కూడిన జట్టు బరిలోకి దిగనుంది.
భారత జట్టు వివరాలు.. విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, ఛటేశ్వర్ పూజారా, రహానే, హనుమ విహారి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బూమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్.