స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నాలుగో వన్డే మ్యాచ్ మొహాలీ వేదికగా ఆదివారం జరుగనుంది. రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డేలో సిరీస్ విజయాన్ని చేజార్చుకున్న భారత్... ఈ మ్యాచ్‌లో గెలిచి.. సిరీస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఇందుకోసం పక్కా ప్రణాళికతో సిద్ధమవుతోంది.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1తో ఉంది. ఆఖరి వన్డేలో రిజర్వ్ బెంచ్‌కు అవకాశం ఇచ్చి అందులో నుంచి మెరికల్లాంటి కుర్రాళ్లను వరల్డ్‌కప్ జట్టు కోసం ప్రత్యామ్నాయంగా ఉంచుకోవాలని చూస్తోంది. ధోనీ, షమీకి విశ్రాంతినిచ్చిన భారత్.. ఈ ఇద్దరి స్థానాల్లో రిషబ్ పంత్, భువనేశ్వర్‌కు అవకాశం ఇవ్వనుంది. ఇప్పటివరకు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గానే ఆడిన రిషబ్.. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపింగ్ కూడా చేయనున్నాడు. దీంతో అందరి దృష్టి అతనిపై నెలకొంది. యూకే బెర్త్‌ను ఖాయం చేసుకోవడానికి ఈ ఢిల్లీ ప్లేయర్‌కు ఇదో గొప్ప అవకాశమని విశ్లేషకులు భావిస్తున్నారు.
అదేసమయంలో భారత బౌలింగ్‌లో భారత్‌కు పెద్దగా సమస్యల్లేవు. కాలి గాయం కారణంగా షమీకి ముందుజాగ్రత్తగా విశ్రాంతినిచ్చారు. దీంతో భువనేశ్వర్ జట్టులోకి రానున్నాడు. మూడో వన్డేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న జడేజా.. స్థానంలో చాహల్ రావొచ్చు. కుల్దీప్‌తో కలిసి స్పిన్ బాధ్యతలు తీసుకోనున్నాడు. సిరీస్ గెలిచే మ్యాచ్ కావడంతో కోహ్లీ తుది జట్టులో పెద్దగా మార్పులు చేసే అవకాశం కనిపించడంలేదు.
ఇరు జట్ల అంచనా..
కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, రాయుడు, రిషభ్ పంత్, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, భువనేశ్వర్, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా/షమీ.
ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), ఉస్మాన్ ఖాజా, షాన్ మార్ష్, మ్యాక్స్‌వెల్, హ్యాండ్స్‌కోంబ్, స్టొయినిస్, క్యారీ, కమిన్స్, లయన్, రిచర్డ్సన్, జంపా.
పిచ్, వాతావరణం
ఫ్లాట్ వికెట్ ఇది. దీంతో ఇక్కడ బ్యాట్స్‌మెన్ పరుగుల పండగ చేసుకోవచ్చు. వర్షం ముప్పేమీ లేదు. మ్యాచ్‌కు అడ్డంకీ లేదు. కానీ మంచు ప్రభావం ఉంటుంది.