ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న కోహ్లీ సేన పొట్టి క్రికెట్‌లో సత్తా చాటింది. శుక్రవారం ఓవల్ మైదానంలో జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు విజయభేరీ మోగించింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది.
నిజానికి ఈ పర్యటనను భారత్ ఓటమితోనే ప్రారంభించింది. వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. ఆ తర్వాత టీ20 సిరీస్‌ను ఆశావహ దృక్పథంతో ఆరంభించింది. శుక్రవారం ఓవల్ మైదానంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 11 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా జట్టుపై విజయం సాధించింది.
భారత్ విసిరిన 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆతిథ్య జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 150 పరుగులు చేసి పరాజయం పాలైంది. టీమిండియా బౌలర్లలో యజువేంద్ర చహల్ 3, నటరాజన్ 3 వికెట్లతో ఆసీస్ పనిబట్టారు.
రవీంద్ర జడేజా గాయపడడంతో అతడి స్థానంలో కాంకషన్ సబ్ స్టిట్యూట్‌గా బరిలో దిగిన చహల్ బౌలింగ్ చేసి ఆసీస్‌ను నిలువరించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక కెరీర్‌లో తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన తమిళనాడు కుర్రాడు నటరాజన్ అద్భుతమైన స్పెల్‌తో అలరించాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి తన ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించాడు.
ఇక ఆసీస్ బ్యాటింగ్ చూస్తే ఓపెనర్లు డీఆర్సీ షార్ట్ 34, కెప్టెన్ ఫించ్ 35 పరుగులు చేశారు. మిడిలార్డర్ లో మోజెస్ హెన్రిక్స్ 30 పరుగులు సాధించాడు. స్మిత్ (12), మ్యాక్స్ వెల్ (2) విఫలమయ్యారు.
అంతకుముందు టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (51), రవీంద్ర జడేజా (44), శాంసన్ (23) రాణించారు. హెన్రిక్స్ 3, స్టార్క్ 2 వికెట్లు తీశారు.
ఈ విజయంతో కోహ్లీ సేన 3 మ్యాచ్ ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఇరుజట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ డిసెంబరు 6న సిడ్నీలో జరగనుంది.