సిడ్నీ వేదికగా మంగళవారం జరిగిన మూడో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు పోరాడి ఓడింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 186 పరుగులు చేసింది. ఆ తర్వాత 187 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా 12 పరుగుల తేడాతో ఓడిపోయింది.
భారత ఆటగాళ్లలో ఓపెనర్ కేఎల్ రాహుల్ స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా పడకుండానే డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ నెమ్మదిగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ధావన్ 28 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శాంసన్ (10), శ్రేయాస్ అయ్యర్ (0)లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు.
అయినప్పటికీ.. కెప్టెన్ కోహ్లీ - హార్దిక్ పాండ్యాలు కలిసి జట్టును గెలిపిస్తారని ఆశలు పెట్టుకున్నారు. కానీ, హార్దిక్ పాండ్యా 13 బంతుల్లో రెండు సిక్స్‌లు ఓ ఫోర్ సాయంతో 20 పరుగులు చేశారు. అయితే, మరో ఎండ్‌లో కోహ్లీ ఉండటంతో మ్యాచ్ గెలుస్తామనే ధీమా ఉన్నది.
కానీ, కోహ్లీ 85 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. 61 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ మూడు సిక్స్‌లు, నాలుగు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత వచ్చిన టెయిల్ ఎండ్ ఆటగాళ్లపై ఒత్తిడి పెరగడంతో భారత్ 20 ఓవర్లలో 174 పరుగులు మాత్రమే చేసింది. చివర్లో ఠాకూర్ (17) ఆశలు రేకెత్తించినా ఫలితం లేకుండా పోయింది. ఆసీస్ బౌలర్లలో స్వాపన్ 3 వికెట్లు తీయగా అబ్బాట్, మ్యాక్స్‌వెల్, టై, జంపాలు ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
అంతకుముందు.. ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. ఓపెనర్ మాథ్యూ వేడ్ ఆరంభం నుంచి ఎదురుదాడి చేస్తూ పరుగుల వర్షం కురిపించాడు. వేడ్ 53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 80 పరుగులు సాధించాడు. గాయం నుంచి కోలుకుని బరిలో దిగిన కెప్టెన్ ఆరోన్ ఫించ్ డకౌట్ అయ్యాడు.
మాజీ సారథి స్టీవ్ స్మిత్ 24 పరుగులు చేయగా, గ్లెన్ మ్యాక్స్ వెల్ తనకు లభించిన లైఫ్ లను సద్వినియోగం చేసుకుని అర్ధసెంచరీ సాధించాడు. మ్యాక్స్ వెల్ 36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 54 పరుగులు చేశాడు. చివరికి వెరైటీగా షాట్ కొట్టబోయి నటరాజన్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2, నటరాజన్ 1, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.