ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా గురువారం గ్రూపు-2లో భారత్, నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. పొట్టి ఫార్మెట్‌లో ఈ రెండు జట్లూ తలపడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సేన ఫేవరేట్‌గా కనిపిస్తున్నప్పటికీ డచ్ జట్టును ఏమాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.
మరోవైపు, ఈ టోర్నీలో భారత్ ఆడిన తన ప్రారంభ మ్యాచ్‌లో పాకస్థాన్‌పై రోహిత్ సేన చెమటోడ్చి నెగ్గింది. విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. హార్దిక్ పాండ్యా మినహా మగిలిన టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా, ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లపై ఇపుడు ప్రతి ఒక్కరి దృష్టి కేంద్రీకృతవైుంది. అలాగే, బౌలర్లు నిలకడగా రాణిస్తే మాత్రం డచ్ జట్టుకు తిప్పలు తప్పవు.
ఇకపోతే, ఆరెంజ్ జట్టు విషయానికి వస్తే లీగ్ దశలో ఆకట్టుకున్న నెదర్లాండ్స్... సూపర్ 12లో బంగ్లాదేశ్‌కు ముచ్చెమటలు పోయించింది. ఆల్‌రౌండర్ బాస్ లీ లీడ్స్ కీలకంగా ఉన్నాడు. అటు బౌలింగ్‌లోనూ ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్ జట్టుకు అండగా నిలుస్తున్నారు.
ఈ మ్యాచ్ జరిగే సిడ్నీ వేదిక బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఇక్కడ 200 పైచిలుకు రన్స్ చేసింది. అందువల్ల తొలుత టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కు మొగ్గుచూపే అవకాశం ఉంది. అలాగే, వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ టాస్ వేసే సమయానికి చిరు జల్లులు పడే అవకాశం ఉంది.
ఇరు జట్ల అంచనా...
భారత్ : రోహిత్, రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్, షమీ, అశ్విన్ లేదా చాహల్, భువనేశ్వర్, అర్ష్‌దీప్ సింగ్.
నెదర్లాండ్స్ : మ్యాక్ ఒడౌడ్, విక్రమ్ సింగ్, బాస్ డి లీడ్స్, ఎకర్‌మెన్, కూపర్, స్కాట్ ఎడ్వర్డ్స్, ప్రింగిల్, టిమ్ వాండర్, క్లాసెన్, పాల్ వాన్, షరీజ్ అహ్మద్, రోలఫ్ వాండర్ మెర్వీ.