కివీస్‌తో మంగళవారం జరిగిన మూడో వన్డేలో భారత్ ఓటమిపాలైంది. అంతేగాకుండా టీ-20లో భారత్ చేతిలో ఘోర పరాజయానికి పాలైన కివీస్ ప్రతీకారం తీర్చుకుంది. ఇందులో భాగంగా 3-0తో భారత్‌ను ఓడించింది. ఫలితంగా టీమిండియా క్లీన్‌స్వీప్‌కు గురై చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. 1989 తర్వాత మూడు అంతకన్నా ఎక్కువ మ్యాచ్‌లున్న వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయిన జట్టుగా కోహ్లీ సేన అప్రతిష్టను మూటగట్టుకోనుంది.
ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ ఓ దశలో సహనం కోల్పోయాడు. రాహుల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కివీస్ పేస్ బౌలర్ జేమ్స్ నీషమ్‌తో వాగులాటకు దిగాడు. అతని బౌలింగ్‌లో బంతిని మిడాన్ దిశగా నెట్టిన రాహుల్ సింగిల్ కోసం నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు పరుగెత్తాడు. ఈ క్రమంలో బౌలర్ నీషమ్ వెనక్కి అడుగులు వేసుకుంటూ రాహుల్‌కి అడ్డుగా వెళ్లాడు. దీంతో.. అతన్ని ఢీకొట్టబోయిన రాహుల్.. అప్రమత్తమై తన దారిని మార్చుకుని సింగిల్ పూర్తి చేశాడు.
ఆపై అతనితో వాగ్వివాదానికి దిగాడు. ఈ మధ్యలో అంపైర్ కలుగజేసుకుని సర్దిచెప్పడంతో రాహుల్ వెనక్కి తగ్గాడు. కానీ.. మళ్లీ నీషమ్ తన నోటికి పని చెప్పడంతో రాహుల్ కోపంగా అతనిపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ ఆఖరి క్షణంలో నీషమ్ పక్కకి తప్పుకోగా.. రాహుల్ తన మోచేతిని అతనికి తాకిస్తూ వెళ్లాడు. చివరకు రాహుల్ స్మైల్ ఇవ్వడంతో ఈ గొడవ సద్దుమణిగింది.
ఇదిలాఉంటే.. టీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ వన్డే సిరీస్‌లో రాణించకపోవడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. మైదానంలో అడుగుపెడితే బౌలర్లపై విరుచుకుపడుతూ సెంచరీల మోత మోగించే కోహ్లి.. ఈ సిరీస్‌లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు.
తొలి వన్డే హాఫ్ సెంచరీ మినహా వరుసగా రెండు వన్డేల్లోను విఫలమయ్యాడు. దీంతో భారత్ కూడా ఓటమిపాలై సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ సిరీస్‌లో కోహ్లీ 55,15,19 పరుగులతో మొత్తం 75 పరుగులు చేశాడు. కోహ్లీ ఇంత దారుణంగా విఫలమవ్వడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి.
ఇక అలవోకగా సెంచరీలు చేసే కోహ్లీ.. గత ఆరు నెలల్లో ఒక్క శతకం బాదలేకపోయాడు. గతేడాది ఆగస్టులో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో సెంచరీ చేసిన భారత కెప్టెన్.. తర్వాత తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో నాలుగు హాఫ్ సెంచరీలు చేసినా.. వాటిని సెంచరీలుగా మార్చలేకపోయాడు.
కోహ్లీ పూర్ ఫామ్‌తో ఇప్పటికే సిరీస్ కోల్పోయిన భారత్.. తాజాగా జరుగుతున్న మ్యాచ్‌లో ఓడటంతో వైట్‌వాష్‌కు గురైంది. దీంతో 1989 తర్వాత మూడు అంతకన్నా ఎక్కువ మ్యాచ్‌లున్న సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయిన జట్టుగా కోహ్లీసేన అప్రతిష్టను మూటగట్టుకుంది.