Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు ఉప్పల్ టీ20 క్రికెట్ మ్యాచ్‌కు టిక్కెట్ల విక్రయం

IndvsAus
, గురువారం, 22 సెప్టెంబరు 2022 (08:47 IST)
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా, మూడు టీ20 మ్యాచ్‌లలో ఇరు జట్లూ తలపడతాయి. ఇందులోభాగంగా, ఇప్పటికే తొలి మ్యాచ్ మొహాలీ వేదికగా జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా రికార్డు స్థాయి స్కోరును ఛేదించింది. ఫలితంగా తొలి టీ20లో భారత్ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్ ఈ నెల 23వ తేదీన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వేదికగా జరుగుతుంది. మూడో మ్యాచ్ ఈ నెల 25వ తేదీ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్ల విక్రయం గురువారం నుంచి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. 
 
గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయం జరుగుతుందని తెలిపింది. ఈ నెల 25న భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌ జరగనుంది. అయితే, ఈ నేపథ్యంలో మ్యాచ్‌ టికెట్ల జారీలో జాప్యంపై క్రికెట్‌ అభిమానులు బుధవారం ఉదయం ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏ వైఖరికి నిరసనగా నగరంలోని జింఖానా మైదానం వద్ద ఆందోళనకు దిగారు. 
 
మరోవైపు హెచ్‌సీఏ వైఖరిపై రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ స్పందించారు. టికెట్ల గందరగోళంపై రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చితే  ప్రభుత్వం సహించదని హెచ్చరించారు. భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్ల అవకతవకలపై విచారణ జరుపుతామన్నారు. టికెట్లు బ్లాక్‌లో అమ్మినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టికెట్ల విక్రయాలు పారదర్శకంగా జరగాలని సూచించారు. ప్రిన్సిపల్‌ సెక్రటరీతో కలిసి ఉప్పల్‌ స్టేడియాన్ని పరిశీలిస్తామన్నారు. స్టేడియం సామర్థ్యం ఎంత.. ఎన్ని టికెట్లు విక్రయించారనే దానిపై తేల్చుతామని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనారోగ్యంతో బాధపడుతున్న మల్లయుద్ధ వీరుడు