ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ సూపర్ 12 గ్రూపు ఏలో సౌతాఫ్రికా జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ఆటగాడు రిలీ రోసో వీరోచితంగా బ్యాటింగ్ చేయడంతో సౌతాఫ్రికా జట్టు ఘన విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో సౌతాఫ్రికా జట్టు 205 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో సఫారీలు 104 పరుగుల విజయలక్ష్యంతో గెలుపొందింది.
అయితే, ఈ మ్యాచ్‌లో స్టార్ ఆటగాడు రిలీ రోసో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 56 బంతులు ఎదుర్కొన్న రిలీ... ఏడు ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. తద్వారా టీ20 వరల్డ్ కప్ ఎనిమిదో ఎడిషన్‌లో తొలి శతకం నమోదు చేసిన తొలి అటగాడిగా నిలిచాడు. భారత పర్యటనలో భాగంగా అక్టోబరులో టీమిండియాతో జరిగిన ఆఖరు టీ20లో 48 బంతుల్లో 100 పరుగులతో అజేయంగా నిలిచిన విషయం తెల్సిందే.