ఈ నెలాఖరు నుంచి ఐసీసీ ప్రపంచ కప్ పోటీలు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం అన్ని క్రికెట్ దేశాలు తమతమ జట్లను ప్రకటించాయి. అలాగే, 15 మంది సభ్యులతో కూడిన భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. అయితే, ఈ జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లకు చోటుకల్పించారు. రెండో వికెట్ కీపర్ స్థానం కోసం రిషబ్ పంత్ గట్టి పోటీ ఇచ్చాడు. కానీ, దినేష్ కార్తీక్‌కు చోటుకల్పించారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చెలరేగాయి.
ఈ విమర్శలపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇపుడు స్పందించాడు. దినేశ్ కార్తీక్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అతన్ని ఎంపిక చేసినట్లు చెప్పాడు. క్లిష్టపరిస్థితుల్లో కార్తీక్ అనుభవం, అతని సహనం .. వరల్డ్‌కప్ ప్రదర్శనకు ఉత్తమంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డాడు.
ఇంగ్లండ్‌లో జరగనున్న వరల్డ్‌కప్‌లో మాజీ కెప్టెన్ ధోనీయే వికెట్‌కీపర్‌గా ఉంటాడు. ఒకవేళ ధోనీకి ఏదైనా అయితే అప్పుడు అతని స్థానంలో దినేశ్ కీపింగ్ బాధ్యతలు చేపడుతాడని చెప్పాడు. ఉత్కంఠభరిత పరిస్థితుల్లో దినేశ్ ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడగలడని కోహ్లీ చెప్పాడు.
ఇదే విషయాన్ని బోర్డులోని ప్రతి ఒక్కరూ అంగీకరించాన్నారు. దినేశ్‌కు అనుభవం ఉందని, ధోనీకి ఏమైనా అయితే.. అప్పుడు దినేశ్ కీలకంగా మారుతాడని, ఒక ఫినిషర్‌గా దీనేశ్ బాగా ఆడగలడని కోహ్లీ చెప్పాడు. భారీ టోర్నమెంట్‌కు అనుభవం ముఖ్యమని, అందుకే అతన్ని ఎంపిక చేశామన్నాడు. 2004లో కార్తీక్ వన్డే అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఇండియాకు 91 వన్డేలు ఆడాడు. 26 టెస్టులు కూడా ఆడాడతను.