వాఖండే స్టేడియంలో బుధవారం భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కీలక సమయంలో బౌలర్ మహ్మద్ షమీ క్యాచ్ జారవిడిచాడు. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. అప్పటికే క్రీజ్‌లో పాతుకుపోయిన కివీస్ కెప్టెన్ వికెట్ చేజారిందనే బాధ. ఆ క్యాచ్‌ను వదిలేసిన ఫీల్డర్‌ను విలన్‌గా చూసిన అభిమానులకు.. కాసేపట్లోనే అతడే తమ హీరోగా మారిపోయాడు. అతనే భారత బౌలర్ షమీ.
న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో బుమ్రా వేసిన స్లోబాల్‌ను అంచనా వేయడంలో విఫలమైన కేన్ మిడాన్‌లో ఉన్న షమీ క్యాచ్‌ను వదిలిపెట్టేశాడు. అయితే, షమీనే కేన్‌తోపాటు టామ్ లేథమ్‌ను ఒకే ఓవర్‌లో పెవిలియన్‌కు పంపడంతో భారత అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. మ్యాచ్ అనంతరం క్యాచ్ డ్రాప్‌పైనా షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'ఈ టోర్నీకి ముందు వరకు ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడలేదు. అయితే, ఎప్పుడు అవకాశం వచ్చినా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. చాలా మంది యార్కర్లు, స్లో బంతుల గురించే మాట్లాడుతుంటారు. కానీ, కొత్త బంతితోనూ వికెట్లు తీసేందుకు ప్రయత్నిస్తున్నా. ఆరంభంలో వికెట్లు తీస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెరిగిపోతుంది. కివీస్‌తో మ్యాచ్‌లో కీలకమైన కేన్ విలియమ్సన్ క్యాచ్‌ను మిస్ చేశా. నాకే బాధేసింది.
దీంతో బౌలింగ్‌లో నా వంతు కోసం ఎదురు చూశా. కివీస్ బ్యాటర్లు దూకుడుగా షాట్లు ఆడేస్తున్నారు. అయితే, వారిని కట్టడి చేసేందుకు బౌలింగ్ ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఉన్నా. పిచ్ కూడా చాలా బాగుంది. కానీ, తేమ ప్రభావం వస్తుందేమోనని కంగారు పడ్డాం. ఇలాంటి సమయంలో స్లో వేసే బంతులు కూడా ప్రభావం చూపకపోవచ్చు. అందుకే, నేను శైలిలోనే బంతులను సంధించా. మేం 2015, 2019 సెమీస్‌లో ఓటములను చవిచూశాం. అయితే, ఈ సారి మాత్రం వదల్లేదు. ఇలాంటి అవకాశం మరోసారి వస్తుందనే ఆలోచన కూడా చేయడం లేదు' అని షమీ తెలిపాడు. ఏడు వికెట్లు తీసిన షమీనే "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు దక్కించుకున్నాడు.