Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీ20లో కివీస్‌ను చితక్కొట్టారు... పొట్టి ఫార్మాట్‌లో భారత్ తొలి విజయం

ఢిల్లీ వేదికగా బుధవారం రాత్రి జరిగిన తొలి ట్వంటీ20లో పర్యాటక జట్టు న్యూజిలాండ్‌ను విరాట్ కోహ్లీ సేన చితక్కొట్టింది. ముఖ్యంగా, టీ-20ల్లో న్యూజిలాండ్‌పై ఖాతా తెరవాలన్న కసి.. సుదీర్ఘ కెరీర్‌కు సొంతగడ్డపై

టీ20లో కివీస్‌ను చితక్కొట్టారు... పొట్టి ఫార్మాట్‌లో భారత్ తొలి విజయం
, గురువారం, 2 నవంబరు 2017 (08:46 IST)
ఢిల్లీ వేదికగా బుధవారం రాత్రి జరిగిన తొలి ట్వంటీ20లో పర్యాటక జట్టు న్యూజిలాండ్‌ను విరాట్ కోహ్లీ సేన చితక్కొట్టింది. ముఖ్యంగా, టీ-20ల్లో న్యూజిలాండ్‌పై ఖాతా తెరవాలన్న కసి.. సుదీర్ఘ కెరీర్‌కు సొంతగడ్డపై వీడ్కోలు పలుకుతున్న ఆశీష్‌ నెహ్రాను విజయంతో సాగనంపాలన్న ఆశ ఫలితంగా కివీస్‌ను టీమిండియా మట్టికరిపించింది. ఇందులో భాగంగా కివీస్‌పై తొలి ట్వంటీ20 విజయాన్ని కోహ్లీ సేన నమోదు చేసింది. అలాగే, తమ సహచరుడు ఆశీష్ నెహ్రాకు ఘనంగా వీడ్కోలు పలికింది. 
 
ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన న్యూజిలాండ్ జట్టు కెప్టెన్.. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే, ఆరంభంలోనే ఓపెనర్లు ధవన్‌, రోహిత్‌ ఇచ్చిన క్యాచ్‌లను వదిలేసిన ఆ జట్టు మూల్యం చెల్లించుకుంది. ఈ అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ధవన్‌, రోహిత్‌ భారత్‌కు భారీ స్కోరు అందించారు. రోహిత్‌ ఆరంభంలో కాస్త జాగ్రత్తపడ్డా ధవన్‌ మాత్రం భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.

ఫలితంగా సగం ఓవర్లకు భారత్‌ 80/0తో నిలిచింది. 11వ ఓవర్‌ నుంచి రోహిత్‌ కూడా చెలరేగి ఆడడంతో స్కోరుబోర్డు జెట్‌ స్పీడులో దూసుకెళ్లింది. ఫలితంగా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ధవన్‌ (52 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 80), రోహిత్‌ (55 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 80) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్‌ 3 వికెట్లకు 202 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్‌ కోహ్లీ (11 బంతుల్లో 3 సిక్సర్లతో 26 నాటౌట్‌) చివర్లో మెరుపులు మెరిపించాడు.
 
అనంతరం 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, కివీస్ బౌలర్లు తేలిపోయిన చోట భారత బౌలర్లు కివీస్‌ను హడలెత్తించారు. చాహల్‌ వేసిన రెండో ఓవర్లోనే హార్దిక్‌ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కు మార్టిన్‌ గప్టిల్‌ (4) వెనుదిరిగాడు. అయితే, నెహ్రా వేసిన మూడో ఓవర్లో మరో ఓపెనర్‌ కొలిన్‌ మన్రో (7) ఇచ్చిన సులభ క్యాచ్‌ను చేజార్చాడు. కానీ, తర్వాతి ఓవర్లోనే అద్భుత యార్కర్‌తో మన్రోను బౌల్డ్‌ చేసిన భువీ కివీస్‌ను దెబ్బకొట్టాడు. 
 
ఈ దశలో కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (28), టామ్‌ లాథమ్‌ (39) మూడో వికెట్‌కు 36 పరుగులు ఓడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. నెహ్రా బౌలింగ్‌లో కేన్‌ క్యాచ్‌ను కోహ్లీ జారవిడిచినా.. పదో ఓవర్లో అతణ్ణి అవుట్‌ చేసిన పాండ్యా ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు తీసిన భారత బౌలర్లు పర్యాటక జట్టును కోలుకోనివ్వలేదు. లాథమ్‌తో కలిసి కాసేపు ప్రతిఘటించిన బ్రూస్‌ (10)తో పాటు గ్రాండ్‌హోమ్‌ (0)ను అక్షర్‌ మూడు బంతుల వ్యవధిలో అవుట్‌ చేయడంతో కివీస్‌ 84/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. 
 
నికోల్స్‌ (6)ను కోహ్లీ రనౌట్‌ చేశాడు. ఆ వెంటనే చాహల్‌ బౌలింగ్‌లో లాథమ్‌ స్టంపౌటవడంతో బ్లాక్‌క్యాప్స్‌ జట్టు ఓటమి తప్పించుకోలేకపోయింది. కివీస్ జట్టులో గుప్తిల్ 4, మన్రో 7, విలియమ్సన్‌ 28, లాథమ్‌ 39, బ్రూస్‌ 10, గ్రాండ్‌హోమ్‌ 0, నికోల్స్‌ (రనౌట్) 6, శాంట్నర్‌ (నాటౌట్‌) 27, సౌథీ 8, ఇష్‌ సోధి (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు: 9 చొప్పున మొత్తం 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. దీంతో 53 పరుగుల తేడాతో విజయం సాధించి పొట్టి ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు చేతబడి చేయించారట!