దుర్భరంగా మారిన వలస కూలీల జీవనం : భజ్జీ ఆవేదన

సోమవారం, 30 మార్చి 2020 (14:10 IST)
దేశంలో కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ అమలు చేస్తోంది. ఇది అనేక రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా, దేశ రాజధాని ఢిల్లీ, ముంబై నగరాల్లో ఈ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ వలస కూలీలంతా తమతమ స్వగ్రామాలకు బయలుదేరారు. దీనిపై భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించారు. 
 
లాక్‌డౌన్ నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందు ప్రభుత్వం వలస కూలీల గురించి ఆలోచించాల్సిందని అభిప్రాయపడ్డాడు. లాక్‌డౌన్‌ కారణంగా వలస కూలీలకు తినడానికి తిండి, ఉండటానికి ఇళ్లు, పని లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. వారికి ఆహారం, డబ్బులు అందించి ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.
 
'ఇలాంటి పరిస్తితులు తలెత్తుతాయని ఎవ్వరూ ఊహించి ఉండరు. పౌరుల భద్రతకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వానికి ఇంకా సమయం ఉందని భావిస్తున్నా' అని హర్భజన్ పోస్ట్ చేశాడు. పైగా, దేశం మొత్తం కరోనా వైరస్‌తో వణికిపోతోందని, ఇపుడు తాను క్రికెట్ గురించి ఆలోచించట్లేదని భజ్జీ చెప్పాడు. 
 
ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యతో పోల్చుకుంటే క్రికెట్ చాలా చిన్న విషయమని స్పష్టం చేశాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో క్రికెట్, ఐపీఎల్ గురించి ఆలోచిస్తే అది తన స్వార్థం అవుతుందన్నాడు. ప్రస్తుతం అందరి ప్రాధాన్యత ఆరోగ్యంపైనే ఉండాలని అని హర్భజన్ విజ్ఞప్తి చేశాడు. 'మనమంతా ఏకమవ్వాల్సిన తరుణమిది. దేశం మళ్లీ దృఢంగా నిలబడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి' అంటూ పిలుపునిచ్చాడు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఆ క్రికెటర్ 'రియల్ వరల్డ్ హీరో' : దేశ సేవలో జోగిందర్ శర్మ!