Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వారికి నచ్చిన ఆటగాడు లేకపోవడంతో బెదిరించి తప్పించారు : హనుమ విహారి!!

Hanuma Vihari

వరుణ్

, బుధవారం, 26 జూన్ 2024 (12:40 IST)
Hanuma Vihari
గత వైకాపా ప్రభుత్వంలో వైకాపా నేతలకు నచ్చిన ఆటగాడు తుది 15 మంది జట్టులో లేకపోవడంతో తనపై ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించారని క్రికెటర్ హనుమ విహారి అన్నారు. ఆయన మంగళవారం ఏపీ మంత్రి నారా లోకేశ్, ఆ తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. 
 
అనంతరం హనుమ విహారి మీడియాతో మాట్లాడుతూ, గతంలో తనకు వేధింపులు ఎదురయ్యాయని, కెప్టెన్సీకి రాజీనామా చేయాలని తనపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారన్నారు. ఆత్మగౌరవం దెబ్బతినడంతో ఇక్కడ ఉండలేక, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుని వేరే రాష్ట్రాల తరపున ఆడాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
 
ఆ వివాదం సమయంలో లోకేశ్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ట్వీట్ చేసి తనకు మద్దతుగా నిలిచారని వెల్లడించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత... తనను కలవాలంటూ లోకేశ్ ఆహ్వానించారని, భవిష్యత్ పై ఆయన భరోసా ఇచ్చారని విహారి పేర్కొన్నారు. 
 
ఆంధ్రా క్రికెట్ జట్టును నీ నాయకత్వంలో మరింత ముందుకు నడిపించాలి అని భరోసా ఇచ్చారు కాబట్టి మళ్లీ పునరాగమనం చేస్తున్నాను అని వెల్లడించారు. 'ఓ కెప్టెన్‌గా నేను ఎప్పుడూ టీమ్ గురించే ఆలోచిస్తాను. గత ఏడేళ్లలో ఆంధ్రా జట్టు 6 పర్యాయాలు దేశవాళీ క్రికెట్లో క్వార్టర్ ఫైనల్స్ చేరింది. ఒక్కోసారి జట్టు ప్రయోజనాల రీత్యా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, నేను తీసుకున్న నిర్ణయం ఆ గవర్నమెంట్‌కు కానీ, ఆ అసోసియేషన్‌‌కు కానీ నచ్చలేదు. 
 
వారు అనుకున్న ఆటగాడు తుది 15 మందిలో లేకపోవడంతో కొందరికి నా నిర్ణయం నచ్చలేదు. అందుకే వాళ్ల మాట వినే వ్యక్తినే కెప్టెన్ చేయాలనుకున్నారు. 
 
అందుకే, ఫస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా నన్ను కెప్టెన్‌గా తప్పుకోవాలని ఒత్తిడి చేశారు. లేకపోతే జట్టులో కూడా స్థానం ఉండదని అనడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో నేను కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. కెరీర్ ముఖ్యం కాబట్టి, ఓ ఆటగాడిగానైనా జట్టులో కొనసాగాలన్న ఉద్దేశంతో వాళ్ల ఒత్తిడికి తలొగ్గాను. ఆటపై గౌరవం ఉంది కాబట్టి, ఆ టోర్నమెంట్ అంతా ఆడిన తర్వాతే విషయాలన్నీ బయటపెట్టాను' అని హనుమ విహారి వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగ్లాను చిత్తు చేసి సెమీస్‌లో అడుగుపెట్టిన ఆప్ఘన్.. స్వదేశంలో మిన్నంటిన సంబరాలు!!