గతంలో భారత క్రికెట్ జట్టుకి ఎంపికై అన్నదమ్ములు ఉన్నారు. వీరంతా అమితంగా రాణించి జట్టుకు ఎన్నో విజయాలు అందించారు కూడా. అలాంటివారిలో సీనియర్ క్రికెటర్ మొహిందర్ అమర్ నాథ్-సురీందర్ అమర్ నాథ్, యూసుఫ్ పఠాన్-ఇర్ఫాన్ పఠాన్, హార్దిక్ పాండ్య-కృనాల్‌లు ఉన్నారు. తాజాగా చహర్ బ్రదర్స్ ఎంపికయ్యారు.
ఈ నెల 23వ తేదీ నుంచి భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఇందుకోసం ఎంపిక చేసిన జట్టులో చహర్ అన్నదమ్ములు చోటుదక్కించుకున్నారు. కరీబియన్లతో టీ20 సిరీస్ ఆడే భారత జట్టుకు దీపక్ చహర్, రాహుల్ చహర్ ఎంపికయ్యారు. దీపక్ చహర్ మీడియం పేసర్ కాగా, రాహుల్ చహర్ లెగ్ స్పిన్నర్. వీరిలో రాహుల్ చహర్ ఇంకా టీనేజ్ కుర్రాడే.
ఇటీవల స్వదేశంలో ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల్లో రాహుల్ ముంబై ఇండియన్స్ తరపున ప్రాతినిథ్యం వహించగా, తన అద్భుతమైన లెగ్ స్పిన్‌తో 13 వికెట్లు సాధించాడు. ఇక దీపక్ చహర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన తొలి రంజీ మ్యాచ్‌లోనే 5 వికెట్లకుపైగా సాధించి అబ్బురపరిచాడు. ఈసారి చహర్ సోదరులు టీమిండియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.