Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్

Advertiesment
కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్
, బుధవారం, 17 జులై 2019 (20:44 IST)
సరిగ్గా 20 ఏళ్ల క్రితం కార్గిల్ శిఖరాలపై భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. పాకిస్తాన్ సైనికులు ఎత్తయిన కార్గిల్ కొండల్లో చొరబడి స్థావరాలు ఏర్పాటు చేసుకోవడంతో ఈ యుద్ధం మొదలైంది. కార్గిల్ యుద్ధం జరిగి 20 ఏళ్లవుతున్న సందర్భంగా బీబీసీ అందిస్తున్న ప్రత్యేక సిరీస్‌లో ఇది తొలి కథనం. 
 
1999, మే 8. పాకిస్తాన్ 6 నార్తర్న్ ఇన్ఫాంట్రీ కెప్టెన్ ఇఫ్తెఖార్, లాన్స్ హవల్దార్ అబ్దుల్ హకీమ్, మరో 12 మంది సైనికులతో కార్గిల్ ఆజం పోస్టులో కూచుని ఉన్నాడు. అప్పుడే భారత్‌కు చెందిన ఆరేడుగురు పశువుల కాపరులు అక్కడ గొర్రెలను మేపడం అతడికి కనిపించింది. "ఆ గొర్రెల కాపరులను అదుపులోకి తీసుకుందామా" అని పాకిస్తాన్ సైనికులందరూ చర్చించుకున్నారు. వారిలో ఒకరు "కాపరులను బంధిస్తే, తమ దగ్గరున్న సరకులన్నీ వాళ్లకు పెట్టాల్సి వస్తుంది, అవి మనకే చాలవు, వదిలేద్దాం" అన్నాడు. గంటన్నర తర్వాత అదే గొర్రెల కాపరులు ఆరు భారత జవాన్లతో అక్కడికి తిరిగివచ్చారు.
 
 
పాక్ చొరబాటు గుర్తించిన లామా హెలికాప్టర్
భారత జవాన్లు తమ బైనాకులర్స్‌లో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. తిరిగి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక లామా హెలికాప్టర్ ఆ ప్రాంతం మీదుగా వెళ్లింది. అది ఎంత కిందగా వెళ్లిందంటే, పాక్ ఆర్మీ కెప్టెన్ ఇఫ్తెఖార్‌కు దానిలోని పైలెట్ బ్యాడ్జి కూడా కనిపించింది. కార్గిల్ కొండల్లో ఎత్తయిన శిఖరాలపై పాక్ సైనికులు భారీగా తిష్ట వేశారనే విషయం భారత జవాన్లకు మొట్టమొదటిసారి తెలిసింది అప్పుడే.

 
కార్గిల్‌పై 'విట్నెస్ టు బ్లండర్-కార్గిల్ స్టోరీ అన్‌ఫోల్డ్స్' పుస్తకం రాసిన పాకిస్తాన్ సైన్యం రిటైర్డ్ కల్నల్ అష్ఫాక్ హుసేన్ దానిపై గురించి బీబీసీతో మాట్లాడారు. "నేను స్వయంగా కెప్టెన్ ఇఫ్తెఖార్‌తో మాట్లాడాను. తర్వాత రోజు భారత సైన్యానికి చెందిన లామా హెలికాప్టర్ అక్కడికి వచ్చినపుడు అది ఆజం, తారిక్, తష్ఫీన్ పోస్టులపై బుల్లెట్ల వర్షం కురిపించిందని చెప్పాడు. భారత హెలికాప్టర్‌పై కాల్పులు జరపడానికి కెప్టెన్ ఇఫ్తెఖార్ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్‌ అనుమతి అడిగితే, వారు ఇవ్వలేదు. ఎందుకంటే దానివల్ల భారత్‌కు 'సర్‌ప్రైజ్ ఎలిమెంట్' మిస్ అవుతుంది" అని చెప్పారు.

 
భారత్‌ ప్రభుత్వానికి విషయం తెలియదు
పాకిస్తాన్ వైపు నుంచి భారత్‌లోకి భారీ సంఖ్యలో చొరబాటు జరిగిందనే విషయం భారత సైనికాధికారులకు తెలిసింది. కానీ దీన్ని తమ స్థాయిలో చక్కబెట్టచ్చని వాళ్లు అనుకున్నారు. అందుకే వారు ఆ విషయం ప్రభుత్వ పెద్దలకు చెప్పాలనుకోలేదు. ఒకప్పుడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ ప్రతినిధిగా పనిచేసిన జశ్వంత్ సింగ్ కొడుకు మానవేంద్ర సింగ్ ఆ రోజును గుర్తు చేసుకున్నారు.

 
"నా ఫ్రెండ్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌లో పనిచేసేవాడు. తను నన్ను కలవాలని ఫోన్ చేశాడు. నేను వాళ్లింటికి వెళ్లా. అతడు సరిహద్దుల్లో ఏదో గందరగోళం జరుగుతోందని చెప్పాడు. చొరబాట్లను తిప్పికొట్టడానికి మొత్తం దళాన్ని హెలికాప్టర్లో ఏదో కఠినమైన ప్రాంతానికి పంపించారన్నాడు. ఉదయం నాన్నకు ఆ విషయం మొత్తం చెప్పాను. ఆయన అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌కు ఫోన్ చేసారు. ఆయన తర్వాత రోజు రష్యా వెళ్లాలి. కానీ జార్జ్ తన పర్యటన రద్దు చేసుకున్నారు. ప్రభుత్వానికి ఆ చొరబాటు గురించి మొదట అప్పుడే తెలిసింది" అన్నారు.
webdunia
 
లక్ష్యం సియాచిన్‌కు భారత్‌ను దూరం చేయడం
ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే, అదే సమయంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ వేదప్రకాశ్ మలిక్ కూడా పోలండ్, చెక్ రిపబ్లిక్ పర్యటనలో ఉన్నారు. ఆయనకు దీని గురించి మొదటి సమాచారం సైనికాధికారుల నుంచి రాలేదు. అక్కడి భారత రాయబారి ఆయనకీ విషయం చెప్పారు. లాహోర్ సమ్మిట్ తర్వాత పాకిస్తాన్ సైనికులు ఇలా గుట్టుచప్పుడు కాకుండా కార్గిల్ పర్వతాలపైకి వెళ్లి కూచోవడం వెనుక అసలు లక్ష్యం ఏంటి అనే ప్రశ్న కూడా వస్తుంది.

 
వారి లక్ష్యం ఒకటే. భారత్‌కు ఉత్తరంగా సుదూరంగా ఉన్న టిప్‌పై సియాచిన్ గ్లేసియర్ లైఫ్ లైన్ అయిన ఎన్‌హెచ్ 1D రహదారిని ఎలాగోలా కట్ చేసి, తమ అదుపులోకి తెచ్చుకోవడం. తర్వాత లడఖ్ వైపు సరుకులు రవాణా చేసే వాహనాల కదలికలను అడ్డుకుని, భారత్ తప్పనిసరి పరిస్థితుల్లో సియాచిన్‌ను వదులుకునేలా చేయాలి". అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అసోసియేట్ ఎడిటర్ సుశాంత్ సింగ్ చెప్పారు.

 
"1984లో సియాచిన్‌పై భారత్ పట్టు సాధించడం ముషారఫ్‌కు చాలా అవమానంగా అనిపించింది. అప్పట్లో ఆయన పాకిస్తాన్ కమాండర్ ఫోర్స్‌లో మేజర్‌గా ఉండేవారు. ఆయన చాలాసార్లు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించడానికి ప్రయత్నించారు. కానీ అందులో సక్సెస్ కాలేకపోయారు" అని సుశాంత్ చెప్పారు.

 
దిలీప్‌ కుమార్ నవాజ్ షరీఫ్‌తో మాట్లాడారు
భారత ప్రభుత్వానికి కార్గిల్ విషయం తెలియగానే కాళ్లకింద భూమి బద్దలైనట్లు అనిపించింది. ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి వెంటనే పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఫోన్ చేశారు. ఆరోజు ఏం జరిగిందో పాక్ మాజీ విదేశాంగ మంత్ర ఖుర్షీద్ మహమూద్ కసూరీ తన ఆత్మకథ 'నైదర్ ఎ హాక్ నార్ ఎ డోవ్'లో చెప్పారు.
webdunia
 
"మీరు నాతో చాలా దారుణంగా వ్యవహరించారని వాజ్‌పేయి షరీఫ్‌తో అన్నారు. లాహోర్‌లో నన్ను హత్తుకుంటూనే, మీవాళ్లను కార్గిల్ ఆక్రమణ కోసం పంపిస్తున్నారు అన్నారు. నవాజ్ షరీఫ్ తనకు ఆ విషయం తెలీదన్నారు. నేను పర్వేజ్ ముషారఫ్‌తో మాట్లాడి మీకు మళ్లీ ఫోన్ చేస్తాను అన్నారు. అప్పుడు వాజ్‌పేయి మీరు నా పక్కనే ఒక పెద్దమనిషి ఉన్నారు, ఆయనతో మాట్లాడతారా" అన్నారు. అప్పుడు బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ నవాజ్ షరీఫ్‌తో మాట్లాడారు.

 
ఫోన్లో దిలీప్ కుమార్ గొంతు వినగానే నవాజ్ షరీఫ్ కాసేపు షాక్ అయ్యారు. దిలీప్ కుమార్ ఆయనతో "షరీఫ్ గారూ మీరిలా చేస్తారని నేనసలు అనుకోలేదు. ఎందుకంటే మీరెప్పుడూ భారత్-పాకిస్తాన్ మధ్య శాంతి గురించే మాట్లాడేవారు. మీకో విషయం చెప్పాలి, భారత్-పాక్ మధ్య ఎప్పుడు ఉద్రిక్తతలు తలెత్తినా ఇక్కడి ముస్లింలు చాలా అభద్రతా భావంలో పడతారు. వారికి ఇళ్లలోంచి బయటికి వెళ్లడం కూడా కష్టమైపోతుంది" అన్నారు.

 
అసలు సమాచారం తెలీని స్థితిలో 'రా'
ఇక్కడ విస్మయం కలిగించే విషయం ఏంటంటే భారత నిఘా ఏజెన్సీల దగ్గర ఇంత పెద్ద ఆపరేషన్ గురించి చిన్న సమాచారం కూడా లేదు. భారత మాజీ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు, పాకిస్తాన్‌లో భారత మాజీ హైకమిషనర్, తర్వాత కార్గిల్ దర్యాప్తు కమిటీలో సభ్యుడు అయిన సతీశ్ చంద్ర దాని గురించి బీబీసీకి చెప్పారు. "రా కార్గిల్ గురించి అసలు తెలుసుకోలేకపోయింది. కానీ అది కూడా తెలుసుకోలేదా అనే ప్రశ్న కూడా వస్తుంది. పాకిస్తాన్ ఎలాంటి అదనపు దళాలు పిలిపించలేదు. పాకిస్తాన్ తమ 'ఫార్మేషన్స్‌'ను మోహరించడం కోసం పెంచినప్పుడు ఆ విషయం రా వరకూ వచ్చింది".

 
వ్యూహాత్మకంగా పాకిస్తాన్ ప్రణాళిక
భారత్ అప్పటి పరిస్థితిని ఎదుర్కొన్న విధానంపై చాలా రకాల విమర్శలు వచ్చాయి. మాజీ లెఫ్టినెంట్ జనరల్ హర్‌చరణ్‌జీత్ సింగ్ పనాగ్ అప్పుడు కార్గిల్‌లో ఉన్నారు. "పాకిస్తాన్ సైనికులు పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లి ఖాళీగా ఉన్న ఒక పెద్ద ప్రాంతాన్ని ఆక్రమించారు. లేహ్-కార్గిల్ రహదారిపై పూర్తి పట్టు సాధించారు. అది వాళ్లు సాధించిన చాలా పెద్ద విజయం" అని ఆయన చెప్పారు.

 
"మే 3 నుంచి జూన్ మొదటి వారం వరకూ మా సైన్యం ప్రదర్శన 'బిలో పార్' అంటే సాధారణం కంటే దిగువన ఉంది. నేను ఒకటే చెబుతా మొదట ఒక నెల వరకూ మా ప్రదర్శన సిగ్గుపడేలా ఉంది. తర్వాత 8వ డివిజన్ చార్జ్ తీసుకోగానే ఆ ప్రాంతంలో ఎలా పనిచేయాలో తెలిసొచ్చింది. అప్పటి నుంచి పరిస్థితులు మెరుగపడ్డాయి. ఆ ఆపరేషన్ చాలా కఠినం. ఎందుకంటే అది కొండల్లో జరుగుతోంది. వాళ్లు పైనుంటే, మనం దిగువన ఉన్నాం" అని పనాగ్ చెప్పారు.

 
పనాగ్ అప్పటి పరిస్థితి ఎలా ఉందో కూడా చెప్పారు. "ఇది ఒక వ్యక్తి మెట్లపై ఎగువన ఉంటే, మీరు కింది నుంచి పైకి ఎక్కుతూ అతడిని దించడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంటుంది. ఇక్కడ రెండో సమస్య అంత ఎత్తులో ఆక్సిజన్ అందదు. మూడో సమస్య అలాంటి పర్వతాలపై పోరాడేందుకు మాకు సరిగా ట్రైనింగ్ లేదు" అన్నారు.

 
జనరల్ ముషారఫ్ ఏమన్నారు
నా దృష్టిలో ఇది చాలా మంచి ప్లాన్ అని, అది భారత సైన్యాన్ని చాలా కష్టాల్లో పడేసిందని జనరల్ పర్వేజ్ ముషారఫ్ చాలాసార్లు చెప్పారు. ముషారఫ్ తన ఆత్మకథ 'ఇన్ ద లైన్ ఆఫ్ ఫైర్‌'లో " అక్కడ మా సైనికులు 8-9 మంది మాత్రమే ఉన్న పోస్టులపై భారత్ పూర్తి బలగాలతో దాడి చేసింది. జూన్ మధ్య వరకూ వారికి ఎలాంటి విజయం దక్కలేదు. 600 మంది జవాన్లు చనిపోయారని, 1500 మందికి పైగా గాయపడ్డారని భారత్ స్వయంగా చెప్పింది. మాకు అందిన సమాచారం ప్రకారం అసలు సంఖ్య దానికి రెట్టింపు ఉంటుంది. నిజానికి భారత్‌కు భారీ ప్రాణనష్టంతో శవపేటికల కొరత కూడా వచ్చింది. శవపేటికల కుంభకోణం కూడా వెలుగులోకి వచ్చింది" అని చెప్పారు.
webdunia
 
తోలోలింగ్‌పై ఆక్రమణతో భారీ నష్టం
జూన్ రెండో వారం ముగుస్తుండగా పరిస్థితి భారత సైన్యం చేతుల్లోకి వచ్చింది. నేను ఆ సమయంలో భారత సైన్యం చీఫ్ జనరల్ వేద్ ప్రకాశ్ మలిక్‌ను ఈ యుద్ధంలో నిర్ణయాత్మక మలుపు ఏది అని అడిగాను. దానికి మలిక్ "తోలోలింగ్‌పై విజయం. మేం కోఆర్డినేట్ చేసిన మొదటి దాడి అదే. అది మాకు చాలా పెద్ద విజయం. నాలుగైదు రోజుల వరకూ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఎంత దగ్గరగా పోరాడామంటే, భారత్-పాక్ సైనికులు ఒకరికొకరు తిట్టుకున్నారు. అవి రెండు వైపులా ఉన్న సైనికులకు కూడా వినిపించాయి" అన్నారు.

 
జనరల్ మలిక్ "మేం దానికి భారీ మూల్యం కూడా చెల్లించాల్సి వచ్చింది. మా వైపు చాలా ప్రాణనష్టం జరిగింది. ఆరు రోజుల వరకూ ఏం జరగబోతోందా అని మాక్కూడా ఆందోళనగా అనిపించింది. కానీ అక్కడ విజయం సాధించగానే వీళ్లను అదుపులో పెట్టగలరని మా జవాన్లు, అధికారులపై మాకు నమ్మకం కలిగింది" అన్నారు.

 
ఒకరిని కొండ దించాలంటే 27 మంది కావాలి
కార్గిల్ యుద్ధం సుమారు 100 కిలోమీటర్ల పరిధిలో జరిగింది. అక్కడ సుమారు 1700 మంది పాకిస్తాన్ జవాన్లు భారత సరిహద్దుల్లో దాదాపు 8-9 కిలోమీటర్లు లోపలికి చొరబడ్డారు. ఈ మొత్తం ఆపరేషన్లో 527 మంది భారత జవాన్లు మృతిచెందగా, 1363 మంది జవాన్లు గాయపడ్డారు.

 
దాని గురించి చెప్పిన సీనియర్ జర్నలిస్ట్ సుశాంత్ సింగ్ "సైన్యంలో మౌంటెన్ ఈట్స్ ట్రూప్స్ అనే ఒక మాటుంది. అంటే కొండలు సైనికులను తినేస్తాయి. భూమిపై యుద్ధం జరుగుతుంటే దూకుడుగా ఉండే సైన్యం, డిఫెన్స్ సైన్యం కంటే కనీసం మూడు రెట్లు ఉండాలి. కానీ కొండలపై ఈ సంఖ్య కనీసం 9 రెట్లు, కార్గిల్‌లో అయితే 27 రెట్లు ఉండాలి. అంటే కార్గిల్ పర్వతాలపై ఒక శత్రు సైనికుడు ఉంటే, అతడిని తొలగించడానికి మనకు 27 మంది జవాన్లు కావాలి. భారత్ వాళ్లను అక్కడి నుంచి తొలగించడానికి మొదట్లోనే మొత్తం డివిజన్‌ను పంపింది. తర్వాత చాలా తక్కువ నోటీస్‌లోనే అదనపు బెటాలియన్లను పిలిపించి ఈ ఆపరేషన్లో మోహరించింది.
webdunia
 
రెండు జెట్లు, ఒక హెలికాప్టర్ కూల్చాం-ముషారఫ్
పాకిస్తాన్ ప్రభుత్వం తనకు అండగా నిలిచుంటే కథ వేరేలా ఉండేదని ముషారఫ్ చివరి వరకూ చెబుతూనే వచ్చారు. ముషారఫ్ తన ఆత్మకథలో "భారత్ తన వైమానిక దళాన్ని ఉపయోగించి ఒక విధంగా ఓవర్ రియాక్ట్ అయ్యింది. అది ముజాహిదీన్ల స్థావరాలు ధ్వంసం చేయడంతో ఆగలేదు, సరిహద్దు దాటి పాకిస్తాన్ సైనిక స్థావరాలపైన కూడా బాంబులు వేసింది. దాంతో మేం పాక్ భూభాగంలో వారి ఒక హెలికాప్టర్, రెండు జెట్ విమానాలను కూల్చేశాం" అని చెప్పారు.

 
బోఫోర్స్ ఫిరంగులతో భారత్ పైచేయి
ప్రారంభంలో భారత్ తన రెండు మిగ్ విమానాలు, ఒక హెలికాప్టర్‌ను కోల్పోయిందనేది నిజమే. కానీ భారత వైమానిక దళం, బోఫోర్స్ ఫిరంగులు విరామం లేకుండా పాకిస్తాన్ స్థావరాలను దారుణంగా 'హిట్' చేశాయి. నసీమ్ జెహరా తన 'ఫ్రం కార్గిల్ టు ది కూ' పుస్తకంలో దాని గురించి చెప్పారు. "ఆ దాడి ఎంత భయంకరంగా, కచ్చితత్వంతో ఉన్నాయంటే పాకిస్తాన్ పోస్టులు ధ్వంసమైపోయాయి. పాక్ సైనికులు ఎలాంటి వనరులు లేకుండా పోరాటం చేస్తున్నారు. తుపాకుల మెయింటనెన్స్ సరిగా లేకపోవడంతో అవి వాళ్ల చేతుల్లో కడ్డీల్లా మిగిలిపోయాయి" అని చెప్పారు.

 
దీనిపై భారత్ కూడా "ఒక చిన్న ప్రాంతంలో ఎన్ని ఫిరంగులు ప్రయోగించామంటే అది ఒక అక్రోట్‌ను పెద్ద సమ్మెటతో కొట్టినట్లైంది అని స్వయంగా చెప్పింది. కార్గిల్ యుద్ధంలో కమాండర్‌గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ మొహిందర్ పురీ కార్గిల్‌ విజయంలో వైమానిక దళం అత్యంత కీలక పాత్ర పోషించిందని చెప్పారు. "పైనుంచి భారత ఫైటర్ జెట్స్ శబ్దం వినిపించగానే, పాకిస్తాన్ సైనికులు బెదిరిపోయేవారు, అటూ ఇటూ పరుగులు తీసేవారు" అన్నారు.

 
నవాజ్ షరీఫ్‌కు క్లింటన్ షాక్
జూన్ రెండో వారం నుంచి భారత సైనికులకు లభించిన 'మొమెంటమ్' జులై చివరి వరకూ కొనసాగింది. చివరకు నవాజ్ షరీఫ్ యుద్ధ విరమణకు అమెరికా సాయం కోరాల్సొచ్చింది. 1999లో అమెరికా స్వాతంత్ర దినోత్సవం అంటే జులై 4న అది జరిగింది. షరీఫ్ అభ్యర్థనపై అప్పటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ అసంతృప్తిగానే ఆయన్ను కలిశారు. క్లింటన్ దక్షిణాసియా అంశాల సహచరుడు బ్రూస్ రెయిడిల్ ఆ సమావేశంలో ఉన్నారు.
webdunia
 
రెయిడిల్ తన 'అమెరికాస్ డిప్లొమసీ అండ్ 1999 కార్గిల్ సమిట్‌' అనే పేపర్లో "ఒక స్థితిలో నవాజ్ షరీఫ్ క్లింటన్‌తో మిమ్మల్ని ఒంటరిగా కలవాలని కోరారు. కానీ, క్లింటన్ అది కుదరదని చెప్పేశారు. బ్రూస్ ఇక్కడ నోట్స్ తీసుకుంటున్నారు. ఈ సమావేశంలో మనం ఏం చర్చించినా వాటిని పత్రాలుగా రికార్డు చేయాలని భావించామని షరీఫ్‌కు చెప్పారు" అని రాశారు.

 
క్లింటన్ షరీఫ్‌తో "బేషరతుగా సైనికులను తొలగించడం మీకు ఇష్టం లేకపోతే, ఇక్కడికి రాకండి, అని నేను మీకు ముందే చెప్పాను. మీరు అలా చేయకపోతే, 'కార్గిల్ సంక్షోభానికి దోషి పాకిస్తానే' అని చెప్పడానికి ముందే సిద్ధం చేసిన ప్రకటన నా దగ్గర సిద్ధంగా ఉంది" అన్నారు. ఆ మాటతో షరీఫ్ ముఖం పాలిపోయింది" అని రెయిడిల్ రాశారు.

 
అప్పుడు పాకిస్తాన్ ప్రతినిధి మండలిలో సభ్యుడుగా ఉన్న తారిక్ ఫాతిమీ కూడా 'ఫ్రం కార్గిల్ టు కూ' పుస్తకం రాసిన నసీమ్ జెహరాకు ఇదే విషయం చెప్పారు. "క్లింటన్‌తో సమావేశం అయిన తర్వాత నవాజ్ షరీఫ్ బయటికి వస్తున్నప్పుడు ఆయన ముఖం ఒత్తిడితో ఉంది. ఆయనకు వ్యతిరేకించే బలం కూడా లేకుండాపోయింది, అని నవాజ్ మాటల ద్వారా తెలిసింది. సరిగ్గా అక్కడ క్లింటన్‌తో షరీఫ్ మాట్లాడుతున్నప్పుడే, టీవీలో 'టైగర్ హిల్‌పై భారత్ పట్టు' అనే వార్త ఫ్లాష్ అవుతోంది" అని తారిక్ చెప్పారు.

 
సమావేశం బ్రేక్ సమయంలో ముషారఫ్‌కు ఫోన్ చేసిన నవాజ్ షరీఫ్ ఈ వార్త నిజమేనా? అని అడిగారు. ముషారఫ్ దానిని ఖండించలేదు.
 
-రేహాన్ ఫజల్
బీబీసీ ప్రతినిధి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విద్యుత్ కొనుగోలుకి కేంద్రం క్లీన్ చీట్ ఇవ్వలేదు.. బాబుకి విష్ణు