సౌతాంఫ్టన్ వేదికగా ఇంగ్లండ్ - విండీస్ తొలి టెస్ట్ : న్యూ రూల్స్ ఇవే!

బుధవారం, 8 జులై 2020 (15:59 IST)
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంగ్లండ్ - వెస్టిండీస్ జట్ల మధ్య సౌతాంఫ్టన్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ బుధవారం ప్రారంభంకానుంది. గత కొన్ని నెలలుగా అన్ని రకాల క్రీడలు స్తంభించిపోయాయి. అయితే, బుధవారం అంతర్జాతీయ క్రికెట్ సందడి మొదలు కాబోతోంది. ఇంగ్లండ్ - విండీస్ జట్ల మధ్య జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఐసీసీ తాత్కాలిక నిబంధనలు తీసుకొచ్చింది. 
 
ఉమ్మి నుంచి కరోనా వ్యాపించే అవకాశం ఉండటంతో బంతిపై ఉమ్మి పూయడాన్ని ఐసీసీ నిషేధించింది. అయితే, ఉమ్మి పూయకుండా అలవాటు పడేందుకు ఇన్నింగ్స్‌కు రెండు సార్లు అనుమతిస్తారు. రెండు హెచ్చరికలను జారీ చేస్తారు. ఆ తర్వాత కూడా మళ్లీ ఉమ్మి పూస్తే... పెనాల్టీ కింద బ్యాటింగ్ చేస్తున్న జట్టుకు 5 పరుగులను ఇస్తారు. అయితే, బంతికి చెమటను పూసేందుకు ఐసీసీ అనుమతించింది.
 
మరోవైపు ద్వైపాక్షిక సిరీస్‌లను స్థానిక అంపైర్లతోనే నిర్వహించనున్నారు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో ఉన్న స్థానిక అంపైర్లు బాధ్యతలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మరో కీలక నిబంధనను కూడా ఐసీసీ తీసుకొచ్చింది. కొవిడ్-19 సబ్ స్టిట్యూషన్‌కు గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆట మధ్యలో ఏ ఆటగాడికైనా కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు తేలితే... అతని స్థానంలో మరొక ఆటగాడిని అనుమతిస్తారు.
 
ఇదేసమయంలో డీఆర్ఎస్ రివ్యూల సంఖ్యను కూడా పెంచింది. టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌కు మూడు రివ్యూలు... వన్డేలు, టీ20ల్లో రెండేసి రివ్యూలకు ఛాన్స్ ఇచ్చింది. ఇదేసమయంలో టెస్టు జెర్సీలపై ఇప్పటివరకు ఉంటున్న మూడు లోగోలకు అదనంగా మరో లోగోకు ఐసీసీ అనుమతినిచ్చింది. మొత్తంమీద సరికొత్త నిబంధనలతో కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే తొలి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ధోనీకి బర్త్ డే విషెస్ చెప్పిన కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్.. బ్రావో హెలికాప్టర్‌ సాంగ్ (Video)