Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధోనీ ఔట్ కావడమే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ : ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్

Du Plessis

ఠాగూర్

, ఆదివారం, 19 మే 2024 (11:06 IST)
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా, శనివారం రాత్రి బెంగుళూరు వేదికగా ఆర్సీబీ, సీఎస్కే జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరం. అప్పటికే ఎంఎస్ ధోనీ (25: 13 బంతుల్లో) దూకుడు మీదున్నాడు. మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా (42 నాటౌట్: 22 బంతుల్లో) ఉన్నాడు. అలాంటి సమయంలో గతేడాది రింకు సింగ్‌కు బలైన యువ బౌలర్‌ గుర్తున్నాడా? ఐదు సిక్స్‌లు ఇచ్చిన యశ్ దయాల్ చేతికి కెప్టెన్ డుప్లెసిస్ బంతినిచ్చాడు. 
 
తొలి బాల్‌కే ధోనీ సిక్స్‌ కొట్టాడు. ఇక తమ పని అయిపోయినట్లేనని ఆర్సీబీ ఫ్యాన్స్ ఉసూరుమన్నారు. కానీ, రెండో బంతిని స్లో డెలివరీగా వేసిన యశ్‌.. కీలకమైన ధోనీ వికెట్‌ను పడగొట్టాడు. అక్కడ నుంచి బెంగళూరు విజయం వైపు కొనసాగింది. ఆ ఓవర్‌లో కేవలం 7 పరుగులే ఇచ్చిన యశ్‌.. ఆర్సీబీని ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ప్రదర్శన చేసినప్పటికీ యశ్‌కు కాకుండా.. బ్యాటింగ్‌లో విలువైన పరుగులు చేసిన డుప్లెసిస్‌కు (54) అవార్డు దక్కింది. మ్యాచ్‌ అనంతరం దానిని యశ్‌కు అంకితం చేస్తున్నట్లు డుప్లీ వ్యాఖ్యానించాడు. 
 
'సొంత మైదానంలో లీగ్‌ స్టేజ్‌ను విజయంతో ముగించడం ఆనందంగా ఉంది. ప్లేఆఫ్స్‌కు చేరడం మరింత ఉత్సాహాన్నిస్తోంది. ఇలాంటి పిచ్‌ను ఇంతవరకెప్పుడూ చూడలేదు. తొలుత బ్యాటింగ్‌ చేయడం కఠినమే. నేను, విరాట్ ఆడుతున్నప్పుడు 150 పరుగులు చేసినా సరిపోతుందేమో అనుకున్నాం. మేం గత ఆరు మ్యాచుల్లోనూ నాణ్యమైన బ్యాటింగ్‌, బౌలింగ్‌తో రాణించాం. వారిని 175కే కట్టడి చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగాం. కానీ, ఎంఎస్ ధోనీ క్రీజ్‌లో ఉంటే ఎంతటి టార్గెట్‌ అయినా కరిగిపోతుంది. ఇలాంటి ఇన్నింగ్స్‌లను ఎన్నో ఆడాడు. 
 
తేమ ఎక్కువగా ఉన్నప్పుడు బంతిపై పట్టు దొరకదు. కానీ మా బౌలర్లు మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయలేదు. నాకు వచ్చిన ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును యశ్‌ దయాల్‌కు ఇచ్చేస్తా. ధోనీ వంటి హార్డ్‌ హిట్టర్‌ క్రీజ్‌లో ఉన్నప్పుడు కుర్రాడు ఇలా బౌలింగ్‌ చేయడం అభినందనీయం. పేస్‌ను తగ్గించి వైవిధ్యంగా బంతులేయడం సరైన నిర్ణయం. తొలి బంతినే యార్కర్‌గా వేద్దామని ప్రయత్నించాడు. కానీ, అది కుదరలేదు. దీంతో స్లో డెలివరీలే బెస్ట్‌ అని అటుగా ప్రయత్నించాడు. 
 
ధోనీని ఔట్ చేయడంతో మేం ప్లేఆఫ్స్‌ రేసులోకి వచ్చేశాం. ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. వారి మద్దతు వల్లే మేం ప్లేఆఫ్స్‌కు చేరుకోగలిగాం. వరుసగా ఆరు మ్యాచుల్లో గెలవడం మాకు మరింత ఉత్సాహాన్నిస్తోంది. నాకౌట్‌లోనూ ఇదే దూకుడు ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తాం' అని డుప్లెసిస్ వెల్లడించాడు. యశ్ దయాల్ (2/42) భారీగా పరుగులు సమర్పించినా కీలక సమయంలో వికెట్లు తీశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్‌ 2024 : విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు - క్రిస్ గేల్ తర్వాత అతడే...