Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్‌ 2024 : విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు - క్రిస్ గేల్ తర్వాత అతడే...

Advertiesment
Kohli

ఠాగూర్

, ఆదివారం, 19 మే 2024 (08:40 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్‌లో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. శనివారం రాత్రి చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన కీలకమైన పోరులో చెన్నైపై 27 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు విజయం సాధించింది. ఇరు జట్ల పాయింట్లు (14) సమమైనప్పటికీ చెన్నై (+0.392) కంటే నెట్‌రన్‌రేట్‌ ఎక్కువగా ఉండటంతో బెంగళూరు (+0.459) నాకౌట్‌కు వెళ్లిపోయింది. ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విరాట్ కోహ్లీ కొత్త రికార్డును సృష్టించాడు. సీఎస్‌కేపై కేవలం 29 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. ప్రస్తుతం సీజన్‌లో ఇప్పటివరకు 14 మ్యాచుల్లో మొత్తం 708 పరుగులు చేసిన కోహ్లీ వద్దే ఆరెంజ్‌ క్యాప్‌ ఉంది. ఈ క్రమంలో ఐపీఎల్‌ చరిత్రలోనే రెండు సీజన్లలో 700కు పైగా స్కోర్లు నమోదు చేసిన తొలి భారత క్రికెటర్‌గా అవతరించాడు. ఓవరాల్‌గా రెండో ఆటగాడు. కోహ్లీ కంటే ముందు క్రిస్‌ గేల్ మాత్రమే ఈ జాబితాలో ఉన్నాడు. గేల్‌ 2012లో 733, 2013లో 708 పరుగులు చేశాడు. వరుస సీజన్లలో ఇన్ని పరుగులు చేసిన ఆటగాడు మరెవరూ లేరు. 
 
అంతేకాకుండా, ఈ సీజన్‌లో 708 పరుగులు చేసిన కోహ్లీ స్ట్రైక్‌రేట్‌ 155.60. ఇప్పటివరకు ఐపీఎల్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌ ఇదే. ప్రస్తుత సీజన్‌లో తన స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు వచ్చినా.. ఏమాత్రం వెనుకడుగు వేయకుండా కోహ్లీ చెలరేగిపోతున్నాడు. 2016 ఎడిషన్‌లో అతడు ఏకంగా 974 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు కోహ్లీ స్ట్రైక్‌రేట్‌ 152. ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ కొనసాగుతున్నాడు.
 
ఐపీఎల్ 2024 లీగ్‌ స్టేజ్‌ను విరాట్ 37 సిక్స్‌లతో ముగించాడు. ఈ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌ అతడే. ట్రావిస్ హెడ్ (36) రెండో స్థానంలో నిలిచాడు. కోహ్లీ 2016లో మొత్తం 38 సిక్స్‌లు కొట్టాడు. ఈసారి ఆ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. గతంలోనూ మే 18 నాడు జరిగిన మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ రాణించిన సందర్భాలే ఎక్కువ. అప్పుడు 56 నాటౌట్, 27 నాటౌట్, 113, 100 పరుగులు చేశాడు. ఈసారి కూడా 47 రన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 343 పరుగులు చేశాడు. అలాగే, భారత్‌ వేదికగా టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీనే. తాజాగా సీఎస్కేపై ఇన్నింగ్స్‌తో 9 వేలకు పైగా స్కోరును నమోదు చేశాడు. అతడి తర్వాత స్థానంలో రోహిత్ (8,008) ఉన్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ 2024 : ఊపుమీదున్న బెంగుళూరును చెన్నై నిలువరించగలదా?