స్వదేశంలో జరగాల్సిన ఐపీఎల్ 13వ సీజన పోటీలను ఈ యేడాది విదేశాల్లో నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పరిశీలిస్తోంది. గత 2009లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగగా, ఆ సమయంలో ఐపీఎల్ టోర్నీని సౌతాఫ్రికాలో నిర్వహించారు. అలాగే, 2014లో కొన్ని మ్యాచ్‌లను యుఏఈలోనూ, మరికొన్ని మ్యాచ్‌లను స్వదేశంలో నిర్వహించారు.
అయితే, ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. అనేక దేశాలకు ఈ వైరస్ సోకింది. దీంతో ప్రపంచ క్రీడారంగం కుదేలైపోయింది. అనేక అంతర్జాతీయ క్రీడా టోర్నీలు వాయిదాపడ్డాయి. అలాగే, ఈ నెల 29వ తేదీ నుంచి స్వదేశంలో జరగాల్సిన ఐపీఎల్ టోర్నీని కూడా వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేశారు.
అయితే, అప్పటికీ పరిస్థితులు కుదుటపడకపోతే, టోర్నీని జూలై - సెప్టెంబరు నెలకు వాయిదావేయడం లేదా, విదేశాల్లో నిర్వహించాలన్న తలంపులో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా, ఈ దఫా కూడా సౌతాఫ్రికాలో ఈ టోర్నీని నిర్వహించే అంశంపై మంతనాలు జరుపుతున్నారు.
దీనికి కారణం లేకపోలేదు. ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీపీ) ప్రకారం సెప్టెంబర్ నెలలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. అలాగే ఇంగ్లండ్ తమ స్వదేశంలో పాకిస్థాన్‌తో సిరీస్ ఆడుతుంది. అనంతరం ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది. దాంతో పాటు జూన్, జులై మధ్య ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) 'ది హండ్రెడ్' (వంద బంతుల మ్యాచ్) లీగ్ కోసం ప్రణాళికలు రచిస్తోంది.
ఈ లెక్కన ఇంగ్లండ్, పాకిస్థాన్‌లకు మినహా మిగతా ప్రధాన దేశాలకు జులై-సెప్టెంబర్ పెద్దగా సిరీస్‌లు లేవు. ఆసియా కప్ మినహాయిస్తే టీ20 వరల్డ్ కప్‌కు ముందు భారత్.. జూన్, జులైలో ఆస్ట్రేలియా, శ్రీలంకతో మూడేసి వన్డేల సిరీస్‌లను ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌ల్లో మార్పులు చేసి ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమం చేయాలని బోర్డు పెద్దలు ఆలోచిస్తున్నారు.
గతంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 2009 ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. 2014లోనూ ఎన్నికల కారణంగా కొంత యూఈఏలో, మరికొంత భాగం స్వదేశంలో నిర్వహించారు. ఇప్పుడు కూడా పరిస్థితులు అనుకూలిస్తే కొన్ని మ్యాచ్లను విదేశాల్లో నిర్వహించాల్సిన అవకాశాలను బోర్డు పరిశీలిస్తున్నట్టు సమాచారం.