భారత టెస్ట్ క్రికెట్ జట్టులోకి యార్కర్ నటరాజన్‌కు చోటు దక్కింది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో బౌలర్ ఉమేష్ యాదవ్ గాయపడ్డారు. ఇపుడు అతని స్థానంలో తమిళనాడు కుర్రోడు నటరాజన్‌కు చోటు కల్పించారు. ఇప్పటికే ప్రధాన పేసర్ మహ్మద్ షమీ గాయంతో సిరీస్ మొత్తానికి దూరం కాగా, ఇప్పుడు ఉమేశ్ కూడా షమీ బాటలోనే నడిచాడు.
కాగా, ఆస్ట్రేలియాతో భారత్ నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఇందులో ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్‌లు ముగిశాయి. మరో రెండు టెస్టులు ఆడాల్సి ఉండగా, ఉమేశ్ స్థానంలో తమిళనాడు లెఫ్టార్మ్ సీమర్ టి.నటరాజన్‌ను జట్టులోకి ఎంపిక చేశారు. ఇటీవలే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన నటరాజన్ అమోఘంగా రాణించాడు.
ఇక సిరీస్‌లో ఇప్పటివరకు 2 టెస్టులు జరగ్గా ఇరుజట్లు 1-1తో సమవుజ్జీగా ఉన్నాయి. మిగిలిన రెండు టెస్టుల కోసం జట్టును ఎంపిక చేసేందుకు ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ సమావేశమైంది. షమీ స్థానంలో ఇప్పటికే ముంబయి పేసర్ శార్దూల్ ఠాకూర్‌ను జట్టులో సెలెక్టర్లు చోటు కల్పించారు.
తాజాగా ఉమేశ్ స్థానాన్ని నటరాజన్‌తో భర్తీ చేయాలని నిర్ణయించారు. అటు, 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ జట్టుతో కలిశాడు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు ఈ నెల 7 నుంచి సిడ్నీలో జరగనుంది.
జట్టు సభ్యులు ...
అజింక్యా రహానే (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శుభ్ మాన్ గిల్, పృథ్వీ షా, ఛటేశ్వర్ పుజారా, హనుమ విహారి, కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్, నటరాజన్, కుల్దీప్ యాదవ్.