ఆసియా క్రికెట్ కప్ టోర్నీలోభాగంగా, ఈ నెల 14వ తేదీన భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత సైనికులతో పాటు ప్రజలను చంపుతుంటే పాక్ క్రికెట్ జట్టుతో మ్యాచ్‌లు ఆడటం మన సైనికుల ప్రాణత్యాగాలను కించపరచడమేనని ప్రస్తావించారు.
అయితే, ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారించాలని పిటిషనర్లు కోరగా అత్యున్నత న్యాయస్థానం ఈవిధంగా స్పందించింది. 'అంత అత్యవసరం ఏమిటి? అది కేవలం ఒక మ్యాచ్. అలా జరగనివ్వండి. మ్యాచ్ ఆదివారం ఉంది. ఏం చేయాలి?' అని జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌ల ధర్మాసనం పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదిని ప్రశ్నించింది.
ఆదివారం మ్యాచ్ ఉందని, శుక్రవారం జాబితాలో చేర్చకపోతే తన పిటిషన్ నిష్ఫలమవుతుందని న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందిస్తూ మ్యాచ్ జరగాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ మ్యాచ్ జరుగుతోందని న్యాయవాది ఊర్వశీ జైన్ కోర్టుకు తెలిపారు. ఈ మ్యాచ్ జరగడం జాతీయ గౌరవం, ప్రజల మనోభావాలకు విరుద్ధమైన సందేశాన్ని పంపుతుందని వ్యాఖ్యానించారు.
'రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే స్నేహాన్ని, సామరస్యాన్ని ప్రదర్శించడం. కానీ, పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌లో మన ప్రజలు చనిపోయారు. సైనికులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడారు. ఈ సమయంలో పాక్‌తో మ్యాచ్ ఆడటం తప్పుడు సందేశాన్ని పంపిస్తుంది. మన సైనికులు ప్రాణత్యాగాలు చేస్తుంటే.. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన దేశంతో ఆడుతూ వేడుక చేసుకుంటున్నాం అని పిటిషన్‌లో వివరించారు.
పాకిస్థాన్ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు కూడా ఈ మ్యాచ్ కారణంగా వేదనకు గురవుతాయని పిటిషనర్లు పేర్కొన్నారు. దేశ గౌరవం, పౌరుల భద్రత వినోదం కంటే ముఖ్యమైనవని అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మ్యాచ్ జాతీయ ప్రయోజనాలకు హానికరమని వ్యాఖ్యానించారు. ఆసియాకప్‌లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్, పాక్‌ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సిద్ధమైంది.