ప్రముఖ బాలీవుడ్ గాయని జనై భోస్లేతో భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ డేటింగ్‌లో ఉన్నారంటూ విస్తృతంగా ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా, ముంబైలోని బాంద్రాలో జరిగిన జనై భోస్లే 23వ జన్మదిన వేడుకల్లో సిరాజ్ పాల్గొనడం, ఆ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ‌్‌లో పోస్ట్ చేయడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి. ఆ ఫోటోలలో సిరాజ్, జనై చాలా సన్నిహితంగా కనిపించడంతో వీరు డేటింగ్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో వారిద్దరిని లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు ట్రోల్స్ చేస్తూ, కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రచారంపై సిరాజ్ స్పందించారు.
తమపై వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. జనై తనకు సోదరి లాంటిదన్నారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. "ఆమెలాంటి సోదరి నాకు ఎవరూ లేరు. ఆమె లేకుండా నేను ఉండాలనుకోను. నక్షత్రాలతో చంద్రుడు ఉన్నట్లుగా, ఆమె వెయ్యి మందిలో ఒకరు" అంటూ కవితాత్మకంగా రాసుకొచ్చారు.
మరోవైపు జనై కూడా ఈ పుకార్లపై స్పందిస్తూ, సిరాజ్ తనకు ప్రియమైన సోదరుడని పేర్కొన్నారు. సింగర్ జనై భోస్లే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలు అన్న విషయం అందరికీ తెలిసిందే.