ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. వైరస్ ప్రభావంతో జనం రోడ్లమీద వెళ్ళాలంటేనే వణికిపోతున్నారు. ముఖ్యంగా అగ్రరాజ్యాలే ఈ వైరస్‌ను తలుచుకుని వణుకుతుంటే తిరుపతికి చెందిన షాపుల యజమానులు కరోనా వైరసా కాకరకాయ అంటూ గట్టిగా కేకలు వేశారు.
ఇదంతా తిరుపతి నగరం ఎయిర్ బైపాస్ రోడ్డులో జరిగింది. ఎపి ప్రభుత్వం లాక్‌డౌన్ విధిస్తే జనం మాత్రం తెల్లవారుజాము నుంచి గుమిగూడి కనిపించారు. అన్నిచోట్లా జనసంచారం కనిపించింది. నిత్యావసర వస్తువుల పేరుతో జనం గుంపులు గుంపులుగా గుమిగూడి కనిపించారు.
తిరుపతి మార్కెట్లో అయితే జనం నిండుగా కనిపించారు. కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇష్టమొచ్చినట్లు అధిక ధరలకు కూరగాయలను విక్రయించేశారు మార్కెట్ వ్యాపారస్తులు.
అయితే 10 గంటలకు నగరం మొత్తం జనం కనిపించారు. ఒక్కసారిగా నగర పాలకసంస్ధ అధికారులు షాపుల వద్దకు వెళ్ళి మూసేయమన్నారు. ఎయిర్ బైపాస్ రోడ్డులోని అన్నమయ్య సర్కిల్ వద్దకు రాగా ఇద్దరు షాపుల యజమానులు మీ దగ్గర ప్రభుత్వం ఆదేశించినట్లుగా జిఓ ఏమైనా ఉందా అంటూ నగర పాలక సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
మేము షాపులు నడుపుకోవాలి.. మాకు వేరే ఆదాయం లేదు. కరోనా వైరసా... కాకర కాయా దానికి మేము భయపడమంటూ గట్టిగా కేకలు వేశారు. దీంతో నగర పాలకసంస్థ సిబ్బందే ఆశ్చర్యపోయారు. విషయం కాస్త తిరుపతి నగర పాలకసంస్ధ కమిషనర్ దృష్టికి వెళ్ళింది.
దీంతో ఆయనే స్వయంగా వచ్చి షాపు యజమానులకు అర్థమయ్యేలా చెప్పారు. పదిరోజుల పాటు షాపులు మూసివేయాలని..కరోనా ఎంత భయంకరమో చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో షాపుల యజమానులు తమ తమ షాపులను మూసివేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.